Telangana: బీఆర్ఎస్ పాలనలో రెండు ఫామ్‌హౌస్‌లు తీసుకొచ్చారు

అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని బీఆర్‌ఎస్‌ చెబుతున్నారని నిజానికి రాష్ట్రంలో సృష్టించింది అప్పులు కాదా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క.

Telangana: తెలంగాణ వస్తే అంతా బాగుంటుందని ప్రజలు ఎన్నో కలలు కన్నారని, కానీ బీఆర్‌ఎస్ ఆ కలలను బద్దలు కొట్టిందని భట్టి మండిపడ్డారు. తెలంగాణ వస్తే అద్భుతమైన అభివృద్ధి, జీవితాల్లో వెలుగులు వస్తాయని రాష్ట్రం కోసం పోరాడారు. ప్రజల పోరాటాన్ని చూసి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. కానీ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు, వెలుగు రాలేదు. బీఆర్‌ఎస్‌ పాలనతో విసిగి వేసారిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌ను గెలిపించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అంకితభావంతో పని చేస్తాం అని చెప్పారు. 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణ స్వర్గధామం అయ్యేదని ప్రజలకు ఈ బాధలు ఉండేవి కాదన్నారు.

అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని బీఆర్‌ఎస్‌ చెబుతున్నారని నిజానికి రాష్ట్రంలో సృష్టించింది అప్పులు కాదా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తక్కువ నిధులు కేటాయించినా ఎన్నో ఆస్తులు సృష్టించామని చెప్పారు. కనిపించే నాగార్జున సాగర్‌, శ్రీశైలం, జూరాల, ఎస్‌ఆర్‌ఎస్పీ, దేవాద, కడెం ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్‌ చుట్టూ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఐటీ ఇలా ఎన్నో పనులు చేశాం. హైదరాబాద్‌కు మంజీరా, గోదావరి నీళ్లు తెచ్చాం అని చెప్పారు.

చాలా తక్కువ డబ్బుతో ఇన్ని ఆస్తులను సృష్టించినప్పుడు. బీఆర్ఎస్ ఈ పదేళ్లలో లక్షల కోట్ల బడ్జెట్‌తో మరెన్నో ఆస్తులను సృష్టించి ఉండాలి. కానీ వారు సృష్టించిన ఆస్తులేవీ ఎక్కడా కనిపించవు. పదేళ్లలో బీహెచ్ఈఎల్, బీడీఎల్ తీసుకొచ్చారా? తెచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు కూడా పోయింది. కేవలం రెండు ఫామ్‌హౌస్‌లు మాత్రమే తీసుకొచ్చారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు తీసుకొచ్చినా ఇప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పంపులు వేయలేదు. సీతారామలో బ్యారేజీ లేదు. అంచెలంచెలుగా నిర్మించిన కాళేశ్వరంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని విమర్శించారు.

Also Read: Eating Rules: కంచంలో చేయి కడుక్కుంటున్నారా.. అయితే ఆ సమస్యలు తప్పవు?