ఇక ఆగేది లేదు.. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం: కేసీఆర్‌

రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయడం లేదని కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
BRS chief KCR's press meet

BRS chief KCR's press meet

. ప్రెస్ మీట్‌తో రాజకీయ సమరం

. మౌనం వీడిన బీఆర్ఎస్ అధినేత

. భూములు అమ్మడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు

KCR Press Meet : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. రెండేళ్లుగా ఓపిక పట్టామని, ఇక ఆగేది లేదని స్పష్టం చేసిన ఆయన, ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయడం లేదని కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక,పై ఉపేక్షకు చోటు లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణను రక్షించుకోవాలన్నది తమ సంకల్పమని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం వెనుక కుట్రలు ఉన్నాయా? అని కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు. గోదావరి నీళ్ల దోపిడీపై ప్రభుత్వం మౌనం పాటిస్తోందని మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ 80 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకుంటోందని, బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఆ నీటిని ఎగువ రాష్ట్రాలకు ఇస్తామని ఏపీ చెప్పిందని గుర్తు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర చెరో 20 టీఎంసీలు వాడుకుంటున్నా, ట్రైబ్యునల్ కేటాయింపులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వేళ 40 టీఎంసీలు సరిపోతాయని కేంద్రానికి లేఖ రాయడం ఏ విధమైన దూరదృష్టి? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. నీటి వాటాల కోసం పోరాడకుండా చేతులెత్తేయడం రాష్ట్రానికి తీరని నష్టం చేస్తుందని హెచ్చరించారు.

నాడు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరుకు ద్రోహం చేశాయని కేసీఆర్ ఆరోపించారు. ఎంత బలహీనమైన ప్రభుత్వం అయినా పాత ప్రాజెక్టులను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక మౌనంగా ఉండబోమని, బహిరంగ సభలు నిర్వహించి నీళ్ల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన మోసాల నుంచి బయటపడాలంటే పోరాడి మన నీటి వాటా సాధించుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నా, అభివృద్ధి పేరుతో పునాదిరాళ్లకే పరిమితమయ్యారని విమర్శించారు. ఆ పునాదిరాళ్లన్నీ కలిపితే ఒక ప్రాజెక్టు పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. అప్పట్లో పొలాల్లోకి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడంతో పాలమూరు నుంచి ముంబైకి వలసలు పెరిగాయని తెలిపారు. తన నిరంతర పోరాటంతోనే జూరాల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ఆ తర్వాత ఆర్డీఎస్ కాలువ పేల్చివేత వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు శాపంలా మారిందని, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ తెలంగాణకు ప్రతికూలంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

  Last Updated: 21 Dec 2025, 08:31 PM IST