KTR: రైతు రుణమాఫీ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు

రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

  • Written By:
  • Updated On - August 3, 2023 / 11:20 AM IST

KTR: రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు పిలుపునిచ్చారు. ఇప్పటికే గత తొమ్మిది సంవత్సరాలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని కేటీఆర్ అన్నారు.

రైతన్నలకు హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించడం అత్యంత సంతోషకరమైన విషయం అన్నారు. అనేక సందర్భాల్లో రైతుల వెంట నిలిచిన పార్టీ శ్రేణులు తాజాగా రైతన్నలకు రుణమాఫీ అంశంలోనూ వారితో కలిసి సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రతి గ్రామము, మండలము, నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతులందరితో కలిసి సంబరాలను ఎవరికి తోచిన విధంగా వారు నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జి లు, జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ సంబరాల తాలూకు కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతుబంధు సమితులతో పాటు సహకార సంఘాల ప్రతినిధులు కూడా ఈ సంబరాల్లో  పాల్గొనాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.