భారతదేశ రాజకీయ వ్యవస్థలో విరాళాలు (Donations) కీలకమైన పాత్ర పోషిస్తాయి. పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు విరాళాలు భారీగా రాబడతాయనే వాస్తవం అందరికీ తెలిసిందే. ఇవి పార్టీపై ప్రేమతో వచ్చినవే కావని, కొన్నిసార్లు బ్లాక్‌మెయిల్, కమిషన్ల రూపంలో వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏడీఆర్ (Association for Democratic Reforms) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలు కలిపి రూ.2,532.09 కోట్ల ఆదాయం పొందాయి. వీటిలో 70 శాతం కంటే ఎక్కువ నిధులు ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయని ఆ రిపోర్టు స్పష్టంగా పేర్కొంది.
ఈ జాబితాలో భారత రాష్ట్ర సమితి (BRS) అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క బీఆర్ఎస్ పార్టీనే రూ.685.51 కోట్లు సేకరించగా, తరువాత స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ (రూ.646.39 కోట్లు), బిజు జనతాదళ్ (రూ.297.81 కోట్లు), తెలుగుదేశం పార్టీ (రూ.285.07 కోట్లు), వైఎస్ఆర్ కాంగ్రెస్ (రూ.191.04 కోట్లు) నిలిచాయి. ఈ ఐదు పార్టీలకే మొత్తం ఆదాయంలో 83.17 శాతం వాటా దక్కింది. ఆశ్చర్యకరంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎక్కువ విరాళాలు పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది వైసీపీ బలహీనతలను, ఆ పార్టీపై విరాళాదారుల నమ్మకం తగ్గిపోయిందనేది స్పష్టంగా తెలియజేస్తుంది.
Heavy Rains : రాయలసీమలో దంచి కొడుతున్న భారీ వర్షాలు..స్కూల్స్ కు సెలవు
2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2023-24లో ప్రాంతీయ పార్టీల ఆదాయం 45.77 శాతం పెరిగింది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే రూ.1,796.02 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. బీఆర్ఎస్, టీఎంసీ, డీఎంకే, బీజేడీ, టీడీపీ, వైసీపీ వంటి పది పార్టీలు కలిపి ఈ మొత్తాన్ని పొందాయి. ఆసక్తికరంగా కొన్ని పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. ముఖ్యంగా వైసీపీ, మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో 55 శాతం అధికంగా ఖర్చు పెట్టినా, చివరికి అధికారాన్ని కూడా కోల్పోయింది, నిధులను కూడా కోల్పోయింది. మరోవైపు బీఆర్ఎస్, టీఎంసీ, బీజేడీ వంటి పార్టీలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా నిల్వ ఉంచాయి.
ఇక ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం చివరికి సుప్రీంకోర్టు వద్ద తేలింది. 2024 ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఈ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి రద్దు చేసింది. ఓటర్లకు సమాచారం తెలుసుకునే హక్కును (ఆర్టికల్ 19(1)(a)) ఇది ఉల్లంఘిస్తుందని, రాజకీయ నిధుల విషయంలో పారదర్శకతను దెబ్బతీసిందని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ బెంచ్ పేర్కొంది. ఈ తీర్పుతో ఇప్పటివరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించిన ప్రాంతీయ పార్టీలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాయని తేలిపోయింది. మొత్తంగా చూస్తే, ఎలక్టోరల్ బాండ్లు ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఎత్తున ఆదాయం అందించినా, పారదర్శకత లేని ఈ విధానం రాజకీయ వ్యవస్థపై అనుమానాల ముసురు వేసింది.