Khammam: ఖమ్మంలో కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన

ఖమ్మం జిల్లా వైరా సమీపంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా నుంచి మధిర రహదారిలో వాహనాల రాకపోకల కోసం గ్రీన్​ఫిల్డ్

Khammam: ఖమ్మం జిల్లా వైరా సమీపంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా నుంచి మధిర రహదారిలో వాహనాల రాకపోకల కోసం గ్రీన్​ఫిల్డ్ అధికారులు భారీ వంతెన నిర్మాణం చేపట్టారు. అయితే ఉదయం నుంచి పనులు ప్రారంభం కాగా వంతెన స్లాబ్ సగం పూర్తయ్యాక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఈ మేరకు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ఈ వంతెనని నిర్మించారు. వివరాలలోకి వెళితే అండర్‌పాస్‌కు ఇరువైపులా వంతెన కాంక్రీట్ స్లాబ్‌ను మధ్యాహ్నం వేశారు. సాయంత్రం కూలీలు రోజు పని ముగించుకుని వెళ్లే సరికి స్లాబ్‌కున్న స్కాఫోల్డింగ్, మెటల్ షీట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కాఫోల్డింగ్‌ను ఏర్పాటు చేయడంలో లోపాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తుంది. అయితే వంతెన ఎందుకు కూలిపోయిందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బ్రిడ్జీ నిర్మాణం వద్ద ఎక్కువగా జనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని అంటున్నారు. హైవే బ్రిడ్జీ పనుల్లో నాణ్యతా లోపాలు, నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవొచ్చని స్థానికులు అంటున్నారు

ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహిస్తోంది. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని ఐదు సివిల్ ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-1ని అమలు చేసే బాధ్యత ఢిల్లీలో ఉన్న HG ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌తో ఉంది. ఈ సంస్థ గంగా ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి కోసం అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ఈ వంతెన కూలడంపై బీఆర్ఎస్ రాజకీయ విమర్శలు చేసింది. ఖమ్మంలో నిర్మిస్తున్న అదానీ-హెచ్‌జి ఇన్‌ఫ్రా గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జి కూలిపోవడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి అని బిఆర్‌ఎస్ నేతలు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Also Read: Telangana: 12 జిల్లాల్లో అధ్యక్షుల్ని మార్చేసిన బీజేపీ