Revanth Reddy : “వ‌రిదీక్ష‌”లో రేవంత్ `సోలో..షో`కు బ్రేక్

కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన `వ‌రి దీక్ష` జ‌రిగిన తీరు గ‌తం కంటే భిన్నంగా కనిపిస్తోంది.

  • Written By:
  • Updated On - November 27, 2021 / 11:32 PM IST

కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన `వ‌రి దీక్ష` జ‌రిగిన తీరు గ‌తం కంటే భిన్నంగా కనిపిస్తోంది. ఎక్క‌డా రేవంత్ రెడ్డికి అనుకూల నినాదాలు వినిపించ‌లేదు. సీఎం రేవంత్..సీఎం రేవంత్..అంటూ కేక‌లు లేవు. దీక్ష‌లో వినిపించిన పాట‌ల్లో ఎక్క‌డా రేవంత్ సోలో..సాంగ్స్ లేవు. ఆయ‌న ప్ర‌సంగం ఆద్యంత‌మూ సైలెన్స్ గా సాగింది. రేవంత్ అభిమానుల ఉత్సాహం ఎటు పోయిందో..తెలియ‌దు. ఆయ‌న కు ప‌లికే జేజేలు ఏమై పోయావో..అర్థం కావ‌డంలేదు. సీఎం కేసీఆర్ మీద విరుచుప‌డినా..తిట్టినా..ఎలాంటి స్పంద‌న రేవంత్ స్పీచ్ కు ప్ర‌త్యేకంగా క‌నిపించ‌లేదు.


ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర స‌భ‌లు, జంగ్ సైర‌న్ , నిరుద్యోగ దీక్ష‌ల్లోనూ రేవంత్ జేజేలు, కేరింతలు సౌండ్ ద‌ద్ద‌రిల్లింది. సీఎం..సీఎం అంటూ రేవంత్ క‌దిలిన ప్ర‌తిసారి ఆయ‌న అభిమానులు నిన‌దించారు. స‌రిగ్గా ఇలాంటి పోక‌డ మీద సీనియ‌ర్లు అధిష్టానంకు ఫిర్యాదు చేశారు. సోలో..వ్య‌వ‌హారం న‌డుస్తుంద‌ని వివ‌రించారు. కొంద‌ర్ని పెట్టుకుని సోష‌ల్ మీడియా వేదిక‌గా రేవంత్ రెడ్డి చేసుకుంటోన్న ప్ర‌చారాన్ని సోనియా, రాహుల్ వ‌ద్దకు సీనియ‌ర్లు తీసుకెళ్లారు. కానీ, తొలి రోజుల్లో పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కాంగ్రెస్ అధిష్టానం ఆలోచ‌న మారింది. రేవంత్ రెడ్డి వ్య‌క్తిగ‌త ప్ర‌చారం చేసుకోవ‌డాన్ని సీరియ‌స్ గా తీసుకుంది. సోలో…షోల‌ను ఆపేయాల‌ని ఆదేశించిన‌ట్టు తెలిసింది. అందుకే, ఇందిరాపార్క్ వ‌ద్ద జ‌రిగిన `వ‌రి దీక్ష` గ‌తానికి భిన్నంగా జ‌రిగిందని కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కోమ‌టిరెడ్డి పేరు రేవంత్ నోట వ‌చ్చినప్పుడు మాత్ర‌మే స‌భ‌లో అనూహ్య స్పంద‌న ల‌భించింది. అప్పుడు మాత్ర‌మే రేవంత్ ప్ర‌సంగానికి దీక్ష‌లో పాల్గొన్న వాళ్లు స్పందించారు. మిగిలిన స‌మ‌యంలో ఎక్క‌డా రేవంత్ కు ప్ర‌త్యేకంగా జేజేలు వినిపించ‌లేదు. ఎలాంటి ప్ర‌త్యేక చ‌ప్పుళ్లు లేకుండా ఆయ‌న ప్ర‌సంగం సాగింది.
ఈ స‌భ‌లో సీనియ‌ర్లు అంద‌రూ పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్లు హ‌నుమంత‌రావు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి, రేవంత్ రెడ్డి ఒకే వేదిక పైన క‌నిపించ‌డంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఊత్సాహం క‌నిపించింది. మొత్తం మీద హుజురాబాద్ ఉప ఫ‌లితాలు తెలంగాణ కాంగ్రెస్‌కు గుణ‌పాఠం నేర్పింద‌ని ఈ దీక్ష జ‌రిగిన తీరును బట్టి అర్థం అవుతోంది. పైగా అధిష్టానం కూడా వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఆలోచించి రేవంత్ రెడ్డికి చుర‌క‌లు వేసినట్టు తెలుస్తోంది. అందుకే, ఇప్పుడు అంద‌రూ ఒకే వేదిక మీద క‌నిపించార‌ని కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోన్న టాక్‌.