ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం (Congress) అమలు చేయలేదని ప్రతిపక్షాలు , ప్రజలు విమర్శలు కురిపిస్తున్న వేళ..ఇప్పుడు ప్రభుత్వానికి మరో షాక్ ఎదురైంది. అతి త్వరలోనే పలు పథకాలను అమలు చేయాలనీ కసరత్తులు మొదలుపెట్టగా..ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections 2025) కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీముల ప్రారంభానికి బ్రేక్ పడింది. అయితే, ఇప్పటికే అమలులో ఉన్న పాత పథకాలు యథావిధిగా కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కొన్ని ముఖ్యమైన సంక్షేమ పథకాలు ప్రజలకు నిరంతరంగా అందుతాయని తెలిపారు.
CM Revanth Reddy : ఫిబ్రవరి 10 లోగా సమగ్ర పర్యాటక విధానం రూపొందించాలి..
ఈనెల 26న ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా వంటి పథకాలు యథావిధిగా అమలవుతాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోకుండా, ఈ పథకాలను నియంత్రణ కోడ్‌లో భాగంగా కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల కమిషన్ గైడ్‌లైన్స్ ప్రకారం కొత్త పథకాలను ప్రవేశపెట్టడం ఇప్పుడు సాధ్యం కాదని పేర్కొంది.
ఫిబ్రవరి 27న రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మోడల్ కోడ్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటించాలని ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కొత్త ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టుల ఆరంభం వంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని పథకాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే మంజూరైన పథకాలకు ఎటువంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (BRS), ఇతర పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనుంది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తెలుస్తుంది.