Telangana Assembly Sessions : రేపటి నుండి జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్ పై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ్యుల ఓరియెంటేషన్ సెషన్ బహిష్కరించాలని బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని కేటీఆర్ తెలిపారు. తొలిరోజే తమను లోపలికి రాకుండా అరెస్టు చేయించారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు ఎత్తిచూపితే అరెస్టు చేశారని చెప్పారు.
బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కేలా గత శాసనసభ సమావేశాల్లోనూ వ్యవహరించారు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్తవాళ్లు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా బుధవారం నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికైనా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.. అని కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా, డిసెంబరు 9 నుండి శాసనసభ సమావేశాలు అని గొప్పగా ప్రకటించి పెండ్లి కోసం సభలను వాయిదా వేస్తారా ?! చట్టసభలకు ఇచ్చే గౌరవం ఇదేనా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. చుట్టాల పెండ్లికోసం చట్టసభలు వాయిదానా ? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం నవ్వులపాలు అవుతోందని బీఆర్ఎస్ అంటోంది. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందన్నట్లుగా, ఏడాది కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఎక్కే విమానం .. దిగే విమానం అన్నట్లు మారిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్న సభలను కేవలం సీఎం ఒక్కరి కోసం వాయిదా వేస్తారా ? అయినా తెలంగాణ అస్థిత్వాన్ని గౌరవించలేనోళ్లు ఇక చట్టసభలను ఏం గౌరవిస్తారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Read Also: Mohan Babu Attack : మీడియా పై మోహన్ బాబు దాడి..చూస్తూ ఉండిపోయిన పోలీసులు