Vijayashanti: బీజేపీ, బీఆర్ఎస్‌ రెండూ పార్టీలు ఒక్కటే: విజయశాంతి

బీజేపీకి గుడ్ బై చెప్పిన సినీ నటి విజయశాంతి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు.

  • Written By:
  • Publish Date - November 18, 2023 / 03:27 PM IST

Vijayashanti: బీజేపీకి గుడ్ బై చెప్పిన సినీ నటి విజయశాంతి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని విజయశాంతి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని తొలగించొద్దని అధిష్టానాన్ని కోరామని.. కానీ ఆయన్ని తొలగించడంతోనే తెలంగాణలో బీజేపీ పరువు పోయిందని అన్నారు. అయితే.. తాను తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం, పాత మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉందని విజయశాంతి అన్నారు.

కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామని పెద్ద మాటలు చెప్పిన బీజేపీ ఆ దిశగా ఏమాత్రం చర్యలు తీసుకోలేదని చెప్పారు. అలా చెప్పడంతోనే బీజేపీలో చేరానని అన్నారు. ఆధారాలు ఉండి కూడా బీజేపీ ఎందుకు బీఆర్ఎస్‌ నాయకులపై చర్యలు తీసుకోలేదు అంటూ మండిపడ్డారు విజయశాంతి. బీజేపీ, బీఆర్ఎస్‌ రెండూ పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. అందరి ముందు విమర్శలు చేసుకుంటూ.. తెరవెనుక ఒప్పందాలు చేసుకుంటాయంటూ విజయశాంతి విమర్శలు గుప్పించారు.

బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరినీ మోసం చేస్తోందని విజయశాంతి అన్నారు. బండి సంజయ్‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించాక బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. కేసీఆర్ నాటిన ఒక విత్తనం .. బీజేపీలో బండి సంజయ్‌ని మార్చేసిందని అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కూలిపోతుంటే బీజేపీ ఏం చేస్తోంది? అని నిలదీశారు. ఇక కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి ఆ పార్టీలో కీలక పదవి దక్కింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీల్లోనికి రాములమ్మను తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ప్రచార కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌ బాధ్యతలను విజయశాంతికి అప్పగించినట్టు తెలుస్తోంది.