Site icon HashtagU Telugu

Boora Narsaiah: టీఆర్ఎస్ కు బూర నర్సయ్య షాక్.. బీజేపీలోకి మాజీ ఎంపీ!

Bura Imresizer

Bura Imresizer

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ముందుగా టికెట్‌ ఆశించి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. బూర నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌ను కలిశారని తెలుస్తోంది.

శుక్రవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బూర నర్సయ్యగౌడ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బూర నర్సయ్యగౌడ్‌ బీజేపీలో చేరితే ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డికి, బూర నర్సయ్య మధ్య పొలిటికల్ ఇష్యూస్ ఉన్నట్టు కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహరంతో నర్సయ్య మనసు నొచ్చుకున్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు.

బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. డాక్టర్స్ జేఏసీ చైర్మన్‌గా వ్యవహరించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిన సమయంలో ఆయన వెంటే ఉన్నారు బూర నర్సయ్య గౌడ్. ఈ కారణంగానే కేసీఆర్ ఆయనకు 2014లో భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చారని చెబుతుంటారు. 2014లో టీఆర్ఎస్ తరపున భువనగిరి ఎంపీగా విజయం సాధించిన బూర నర్సయ్య గౌడ్.. 2019లో మాత్రం కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.