Book My CM : ‘బుక్ మై సీఎం’ పోస్టర్ల కలకలం.. వాటిలో ఏం రాశారంటే.. ?

Book My CM : రాజకీయ పార్టీల మధ్య పోస్టర్ల వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ పై సైతం హైదరాబాద్ లో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి.

  • Written By:
  • Updated On - September 17, 2023 / 12:15 PM IST

Book My CM : రాజకీయ పార్టీల మధ్య పోస్టర్ల వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ పై సైతం హైదరాబాద్ లో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘బుక్ మై సీఎం.. డీల్స్ అవైలబుల్.. 30 శాతం కమీషన్’ (Book My CM) అని ఆ పోస్టర్లపై రాసి ఉంది. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేసే దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా ఈ పోస్టర్లను అతికించాయని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. నేరుగా ప్రశ్నించే దమ్ములేక ఇలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  మరోవైపు శనివారం రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభానికి ముందు కూడా  సిటీలో పలుచోట్ల కాంగ్రెస్ కీలక నేతలకు వ్యతిరేకంగా కూడా పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని ముఖ్య నేతలపై ఆ పోస్టర్లలో విమర్శలు గుప్పించారు. వారు కొన్ని స్కాంలు చేశారనే ఆరోపణలను పోస్టర్లలో ప్రస్తావించారు.

Also read : Telangana : జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

ఇక హైదరాబాద్ లో మరోచోట కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు కట్టారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎస్సీ విభజనపై దళితులను మోసం చేసిందని ఆ ఫ్లెక్సీలలో ప్రస్తావించారు. కొత్తగా ఎస్సీ డిక్లరేషన్‌తో దళితులను దగా  చేసేందుకు కాంగ్రెస్ రెడీ అయిందని వాటిలో పెద్దపెద్ద అక్షరాలతో రాతలు రాశారు.   మొత్తం మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా హైదరాబాద్ లో పోస్టర్లు ఏర్పాటు కావడాన్ని బట్టి.. అందరి వేళ్లూ ఓ ప్రధాన పార్టీ వైపే చూపుతున్నాయి. ఆ పార్టీ వాళ్లే ఈ పోస్టర్ల ప్రచారానికి జరుపుతున్నారనే అనుమానాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓ వైపు తెలంగాణ విమోచన దినోత్సవం.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ.. ఇంకోవైపు టీఆర్ఎస్ సమైక్యతా దినోత్సవం నడుమ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. పరస్పర విమర్శలతో రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి విరుచుకుపడుతున్నాయి. ఈ తరుణంలో పోస్టర్ల ప్రచారం ప్రాధాన్యతను సంతరించుకుంది.