Site icon HashtagU Telugu

BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో సభ్యులంతా కాంగ్రెస్ గూటికి…

Bjp Manifesto

Bjp Manifesto

BJP Manifesto: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అయితే మొదటి కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించగా, బీఆర్ఎస్ కూడా తాజాగా ప్రకటించింది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్నా కాషాయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

29 మంది సభ్యులతో కూడిన మ్యానిఫెస్టో కమిటీకి గత నెలలో వివేక్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అయితే కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా మారడంతో ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసే ప్రక్రియ మొత్తం తారుమారైంది. చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకా పోటీలో నిల్చున్నారు. మరోవైపు గత ఏప్రిల్‌లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని కమిటీ కన్వీనర్‌గా నియమించారు. నిర్మల్ నియోజకవర్గం అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని మేనిఫెస్టో కమిటీ జాయింట్ కన్వీనర్‌గా నియమించారు. ఈ మాజీ ఎంపీ గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి నేతృత్వం వహించారు. గత ఏడాది ఆగస్టులో రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే గతేడాది నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మరోవైపు ప్రముఖ నటి, మాజీ ఎంపీ విజయశాంతిని కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. అయితే ఆమె కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవలి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలకు ఆమె దూరంగా ఉన్నారు.

ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే మేనిఫెస్టోను ఎవరు రూపొందిస్తున్నారనే విషయంపై బీజేపీ నేతలకు స్పష్టత లేకుండా పోయింది. పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కీలకమైన అంశాల గురించి వివేక్‌కు అవగాహన ఉన్నందున, ఇది బీజేపీ పార్టీ మేనిఫెస్టోపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకప్పుడు బీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో చాలా వెనుకబడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌కుమార్‌కు ఉద్వాసన పలికిన తర్వాత పార్టీలో అంతర్గత పోరు పార్టీకి మరో దెబ్బ తగిలింది. ప్రస్తుతం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సారథ్యంలో పార్టీ వీక్ గా కనిపిస్తుంది.

Also Read: Angelo Mathews : టైమ్డ్ ఔట్ వివాదం.. ఐసీసీకి మాథ్యూస్ ఫిర్యాదు