Site icon HashtagU Telugu

BJP : ఫ్రస్ట్రేషన్‌లో బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం.. సొంత పార్టీ నేత‌ల‌కు బెదిరింపులు.. ?

What Happened in Telangana BJP disputes in Party Leaders

What Happened in Telangana BJP disputes in Party Leaders

బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణ‌లో సొంత పార్టీ నేతలే అగ్ర‌నాయ‌త్వానికి అల్టిమేటం ఇవ్వటం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లాలంటూ మద్దతు దారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్వయంగా తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కు వివరించారు. పార్టీ ఎదుగుదలకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనతో వారు షాక్ అయ్యారు. పార్టీ వీడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిన తీరు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ మొదలైంది. ఇప్పుడు అది ఢిల్లీ వరకు చేరింది. బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అంచనాలు వేసినా సఫలం కాలేదు. బండి సంజయ్ నాయకత్వం పైన ఒక విధంగా పార్టీలో నేతలు తిరుగుబాటు చేశారు. పార్టీ హైకమాండ్‌కు బండి సంజ‌య్‌ని మార్చాలంటూ డిమాండ్ చేసారు. పార్టీలో పరిణామాల పైన బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు రిపోర్టులు ఇచ్చారు. అయితే రాష్ట్ర బీజేపీ నేత‌ల డిమాండ్‌ని బీజేపీ అధినాయకత్వం లైట్ తీసుకుంది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని స్థాయిలోనూ నేతలు కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకత్వాల తెర వెనుక రాజకీయం తమ మనుగడకే ముప్పు తెస్తుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ నేతలను కాంగ్రెస్ లో చేరాలంటూ కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో హైకమాండ్ తో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని తాజాగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీలో పరిస్థితి అగ్ర‌నేత‌ల‌కు వివరించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం మార్చాలని కోరారు. తమను ఢిల్లీకి పిలిచి అటు కేటీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వటం పైన సందేహాలు ఉన్నాయని స్పష్టం చేసారు. కవిత అరెస్ట్ కాకపోవటంతో అనుమానాలు బల పడుతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ ను దెబ్బ తీసే నిర్ణయాలు తీసుకోకుంటే తాము పార్టీలో కొనసాగే అవకాశాలు లేవని.. నియోజకవర్గాల్లో తమ పైన ఒత్తిడి పెరుగుతుందని స్పష్టం చేసారు. వీరి వాదన విన్న తరువాత పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన సమాధానంతో ఈ ఇద్దరు నేతలు షాక్ కు గురయ్యారు. కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందంటూ సొంత పార్టీ నేతలు చెప్పిన సమాచారం మాత్రం బీజేపీ నాయకత్వం జీర్ణించుకోలేక పోయింది. పార్టీ వీడే ఆలోచన చేస్తే సహించేది లేదని పార్టీ అధినాయకత్వం హెచ్చరించినట్లు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. సహజంగా బీజేపీ నాయకత్వం విచారణ సంస్థలతో వేధించే విధానం తెలిసిన ఆ ఇద్దరు నేతలకు ఏం చెబుతున్నారో క్లారిటీ వచ్చేసింది. అప్పటికప్పుడు ఏం చెప్పలేక బయటకు వచ్చేసారు. కానీ, నడ్డా తెలంగాణకు వచ్చినా ఆ ఇద్దరూ ఢిల్లీలోనే ఉండిపోయారు. మరోసారి ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భవిష్యత్ నిర్ణయాల పైన మల్ల గుల్లాలు పడుతున్నారు.

పార్టీని బతికించమని అడిగితే హెచ్చరికలు చేయటం వారికి అంతు చిక్కటం లేదు. అటు వ్యాపారాలు..ఇటు రాజకీయాలు దేనిని పణంగా పెట్టలేక సతమతం అవుతున్నారు. ఇటు ఇదే రోజున ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతున్నారు. పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్దమైంది. ఇటు కాంగ్రెస్ లో పెరుగుతున్న జోష్‌… నాయకత్వం నుంచి హెచ్చరికలతో ఈటెల, కోమటిరెడ్డితో సహా పలువురు నేతలు బేజారు అవుతున్నారు. మరి కొద్ది రోజులు వేచి చూసే నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Exit mobile version