Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, తెలంగాణకు అమిత్ షా రాక

  • Written By:
  • Updated On - February 20, 2024 / 05:37 PM IST

Amit Shah: బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఆయన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయన చివరి సారిగా గతేడాది డిసెంబర్ 27న రాష్ట్రానికి వచ్చారు.షా లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలిచి 35 శాతం ఓట్లు సాధించాలని స్థానిక నాయకత్వానికి అమిత్ షా టార్గెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో భాజపా  విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నారాయణపేట జిల్లా కృష్ణాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు. ఆ పార్టీ రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి యాత్రలను కొనసాగించనుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కి.మీ మేర యాత్రలు నిర్వహించనున్నారు. 106 సమావేశాలు, 102 రోడ్‌ షోలు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మార్చి 2న ఇవి ముగియనున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ సగంపైగా సీట్లు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తులు చేసింది. ఏయే స్థానంలో ఎవరిని దింపాలో ఆలోచనలు చేసింది. అయితే ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడపోయిన నేతలంతా ఎంపీ సీట్ల కోసం ఒత్తిడి తెస్తుండటంతో హైకమాండ్ కు తలనొప్పిగా మారే అవకాశ ఉంది.