Site icon HashtagU Telugu

BJP: తెలంగాణపై బీజేపి కన్ను!

Bjp

Bjp

గ్రాడ్యుయేట్,టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కేసీఆర్ చారిత్రిక తప్పిదం.2014 నుంచి తెలంగాణలో రాజకీయ బలాబలాలను సమీక్షిస్తే,బీజేపీ మునుపటికన్నా బలం పుంజుకుంది.కేసీఆర్ పరోక్షంగా,ప్రత్యక్షంగా ఆ పార్టీని తెలంగాణ రణరంగంలో ‘నిలదొక్కుకునే’ ఒక స్పేస్ ను బీజేపీకి విడిచిపెట్టినట్టు విమర్శలున్నవి.పాలు పోసి పెంచిన బీజేపీని ఇప్పుడు తుంచివేయలేని స్థితికి చేరుకున్నది.”ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో అధికారం మాదే”! అని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ప్రకటనలు చేస్తున్నారు.కాంగ్రెస్,బిఆర్ఎస్ నుంచి ‘గెలుపు గుర్రాల’ను లాగివేయడానికి బిజెపి గట్టిగా ప్రయత్నిస్తోంది.అదృష్టవశాత్తు 2018,2023 ఫలితాల తర్వాత కేసీఆర్ పార్టీలో పొటెన్షియల్ నాయకుడు ఎవరూ సాహసించి ‘షిండే’గా అవతరించలేదు.అలాంటి పరిస్థితులు ఎదురైతే బీజేపీకి పంట పండేది.బీజేపీలో కేసీఆర్ తో,ఇప్పుడు రేవంత్ తో తలపడగలిగే నాయకులు ఎవరూ లేరు.పైగా కాంగ్రెస్ సంస్కృతి లాగా ‘ముఠా’ కుమ్ములాటలూ కనిపిస్తున్నవి.

”ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్,కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అంటున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఎందుకు తీసుకురాలేకపోతున్నారు.ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఎప్పుడు తీసుకువస్తారో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ చెప్పాలి.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడంలేదు. కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్,హరీష్‌రావు ప్రచారం చేస్తున్నారు.ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏమిటో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లను పోగొట్టుకుని ఎనిమిది చోట్ల బీజేపీ ఎంపీలను గెలిపించారు.హైదరాబాద్‌లో మెట్రో విస్తరణను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.మూసీ ప్రక్షాళనకు అనుమతి ఇవ్వడం లేదు.రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి కాకుండా ఎంపీ ఈటల రాజేందర్,కిషన్ రెడ్డి కలిసి అడ్డు పడుతున్నారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 24 న ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

బీజేపీ,బిఆర్ఎస్ మధ్య తెరచాటు స్నేహంపై మరోసారి చర్చ జరుగుతున్న చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్యం పోశారు. .బిఆర్ఎస్- బిజెపి మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే చక్కటి అవగాహనతో ఉన్నాయన్న విమర్శలున్నాయి.అయిదు పార్లమెంట్ సీట్లకు బిఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టింది.నిన్నటిదాకా నల్లగొండ జిల్లా హూజూర్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న శానంపూడి సైదిరెడ్డిని బిజెపిలోకి పంపించి, నల్లగొండ పార్లమెంటు టికెట్ ఇప్పించినట్టు ప్రచారం ఉన్నది.సైదిరెడ్డి,మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కుడి భుజం.జగదీశ్ రెడ్డి కేసీఆర్ కు కుడి భుజం.మరి అటువంటి భుజం ఎన్నికలై నెల తిరగకుండానే బిజెపిలో చేరడం అంటే వాళ్ల మధ్య ఉన్న ఒప్పందం,రహస్య స్నేహమే కారణం.ఈ విషయం హుజూర్ నగర్,నల్లగొండ ప్రాంతాల్లో సాధారణ ఓటర్లు చెప్పుకుంటూ ఉంటారు.

కెసిఆర్ తాను బలంగా ఉన్న హైదరాబాద్ సిటీలో ఉన్న నాలుగైదు సీట్లలో బిజెపికి మార్గం సుగమం చేయడానికి,బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టినట్టు ప్రచారంలో ఉన్నది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి ఎక్కువ ఓట్లు సీట్లు వస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇద్దరు కలిసి కూలదోయాలని,పరస్పర అవగాహనతో రెండు పార్టీలు అధికారం దక్కించుకోవాలని పధకం వేసినట్లు జనంలో ఒక టాక్ ఉన్నది.బిఆర్ఎస్ సహకారంతోనే 8 లోక్ సభ సీట్లను బీజేపీ గెల్చుకోగలిగినట్టు అప్పట్లో మజ్లీస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.దీనికి .దాదాపు నాలుగు సంవత్సరాలుగా బీజేపీ,బిఆర్ఎస్ మధ్య ఇరువురి స్నేహం చిగురించి,వికసించిందని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు,ఆధారాలు ఉన్నాయని కొందరు విశ్లేషకుల మాట.ఆ స్నేహం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతూ ఉందని చెప్పడానికి బండి సంజయ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తొలగించడంతోనే తేటతెల్లమైందని వారంటున్నారు.

రేవంత్ రెడ్డి లాంటి ఓ సాధారణ ఎమ్మెల్యే తమను ఓడించడం కేటీఆర్ కు,కేసిఆర్ కు మింగుడు పడడం లేదు.ఉన్నపళంగా రేవంత్ ను దించి అవసరమైతే బిజెపి నయినా గద్దెనెక్కించాలన్నది వాళ్ళ పన్నాగం అనే ఆరోపణలూ ఉన్నవి.ఫోన్ టాపింగ్ కేసులో చిక్కుకొని, తండ్రి కొడుకులు జైల్లోకి పోవడం ఖాయమని విస్తృతంగా చర్చ జరుగుతోంది.ఆ భయం కొంత ఉంటే రేవంత్ రెడ్డిని భరించలేకపోవడం మరికొంత వాళ్ళను వేధిస్తున్నది.అధికారదాహంతో ఉన్న కేసీఆర్,కేటీఆర్ సామాన్య ఎమ్మెల్యేలుగా ఉండడం జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొన్ని రోజులు గడిస్తే తమ ఎమ్మెల్యేలు తమ చేతిలో ఉండరని కేసీఆర్ అంచనా కావచ్చు.అందుకోసం అతిపెద్ద శత్రువు,బలమైన శత్రువు అయిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు బిజెపి ఇనుప కౌగిలిని,కెసిఆర్ ఆలింగనం చేసుకుంటున్నట్టు పరిశీలకులంటున్నారు.
రేపు అది దృతరాష్ట్ర కౌగిలిగా మారినప్పుడు కేసీఆర్ కు తెలుస్తుందంటున్నారు.

బిజెపికి ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఎలాంటి ప్రయోగం చేసినా విఫలమవుతుంది.అలాగే 28 మంది ఎమ్మెల్యేల బలంతో కేసీఆర్ చేయగలిగింది కూడా ఏమీ లేదు.బిజెపితో కలిసి పనిచేస్తే కర్ణాటక కుమారస్వామి గతి ఏమైందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఆచితూచి పది సీట్లు ఇచ్చింది. 50 సీట్లు ఇస్తే 30 మందిని బీజేపీ లాగేయగలదని చంద్రబాబు ముందుగానే అంచనా వేశారు.ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతున్నందున ఆ పార్టీకి తాత్కాలికంగా తలవంచుతున్నారు కానీ నిజాయితీగా కాదు.అలాగే తెలంగాణలో 60 సీట్లు వస్తే తప్ప బీజేపీ అధికారం అందుకోజాలదు.

“నరేంద్ర మోడీ జాతీయ వాదంతో ముందుకు సాగుతున్నాడు.కనుక జాతీయవాదాన్ని మించిన నినాదమేదైనా చేపట్టేదాకా కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీని గద్దె దించటమనేది అసాధ్యం”.అని ప్రశాంత్ కిశోర్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.అయితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాలలో బీజేపీని నిలువరించగలుగుతున్నవి.తమిళనాడు,పశ్చిమ బెంగాల్ ఇందుకు ఉదాహరణ.టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిపోవడంతో తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి.రాష్ట్రంలో రాజకీయ బలాబలాల్లోనూ అందుకు తగినట్లే అనూహ్యంగా మార్పులు కనిపిస్తున్నవి.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రాంతీయపార్టియో,జాతీయపార్టీయో తేల్చుకోలేక కేసీఆర్ సతమతమవుతున్నారు.ఆయనకు ‘ఇగో’ అన్నది సహజసిద్ధంగా మైనస్ పాయింటు.ఒకసారి జాతీయపార్టీగా ప్రకటించినందున దాన్నుంచి వెనక్కి రాలేరు.ముందుకు పోలేరు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ,వై.ఎస్.ఆర్.సీ.పీ.రెండూ ఒకటే అన్న ప్రచారం ఉధృతంగా సాగింది.జనం నమ్మారు కూడా.బీజేపీ ఖండించనే ఖండించలేదు.తెలంగాణలో కూడా తన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బిఆర్ఎస్,బీజేపీ రెండూ వేర్వేరు కావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రచారాన్ని ఉధృతం చేశారు.ఈ ప్రచారం జనంలోకి వెళుతోంది.తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం పని చేసిన ఉద్యమకారులెవరికీ బీజేపీ పొడ గిట్టదు.చావో రేవో బిఆర్ఎస్ ఒంటరిగానే రంగంలోకి దిగాలి కానీ మతతత్వ బీజేపీతో చేతులు కలపరాదని వారంటున్నారు.అలాగే బీజేపీ కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ బిఆర్ఎస్ ను కూటమిలోకి రానివ్వకుండా అడ్డుతగలడం గ్యారంటీ.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,కేసీఆర్ ల మధ్య వైరం ‘సిల్వర్ జూబ్లీ’ గడుస్తోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ,బిఆర్ఎస్,మజ్లీస్ ఒక్కటేనన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీకి వర్కవుట్ అయ్యింది.దీన్ని బీజేపీ సకాలంలో ఖండించలేదు.ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. అవే ఆరోపణల్ని సకాలంలో ఘాటుగా ఖండించి,తిప్పికొట్టిన మజ్లీస్ పార్టీ తమ 7 సీట్లనూ నిలబెట్టకుంది.భారతీయ జనతా పార్టీ చేసే “డబుల్ ఇంజన్ సర్కార్” కాన్సెప్ట్ ప్రకారం,ఒకే పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటే,అభివృద్ధి వేగంగా జరుగుతుంది.కేంద్రం,రాష్ట్రం ఒకే పార్టీ ఆధ్వర్యంలో ఉంటే,కేంద్ర ప్రభుత్వ నిధులను అడ్డంకుల లేకుండా విడుదల చేయగలగడం సులభమని బీజేపీ నమ్మిస్తుంది. కేంద్ర-రాష్ట్ర పరిపాలనలో ఏకీభావంతో పాలసీలను త్వరగా అమలు చేయడం సాధ్యం అవుతుంది.పాలనా తేడాలు లేకపోవడం వల్ల నిర్ణయాలను త్వరగా అమలు చేయడం, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉందన్న వాదనను బీజేపీ జోడించింది.

కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా లోబడి ఉండటం వల్ల ‘స్వయం నిర్ణయం’ తీసుకునే శక్తి బలహీనమవుతుంది.ఒకే పార్టీ ఉండడం వల్ల రాజకీయంగా విభిన్న ఆలోచనల ప్రాధాన్యత కోల్పోవచ్చు.రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయ అభిప్రాయాల వినిపించుకునే అవకాశం తగ్గిపోతుంది.కొన్ని రాష్ట్రాల్లో “డబుల్ ఇంజన్ సర్కార్” ద్వారా అభివృద్ధి వేగంగా జరిగితే, మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రాధాన్యత కేంద్ర-రాష్ట్ర భేదాల వల్ల మారుతూ ఉంటుంది.ప్రభుత్వాలు ప్రజా అవసరాలను అర్థం చేసుకుని పనిచేయాలి కానీ, కేవలం ఒకే పార్టీ ఉండటం వల్లే అభివృద్ధి జరుగుతుందని భావించడం అతిశయోక్తి.”డబుల్ ఇంజన్ సర్కార్” కాన్సెప్ట్ లో సానుకూల, వ్యతిరేకత రెండూ ఉన్నాయి.పాలనపరంగా వేగంగా పనిచేసే అవకాశాలు ఉన్నప్పటికీ, విభిన్న అభిప్రాయాలను, రాష్ట్ర అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకోవడం కూడా సమర్థ ప్రభుత్వానికి అవసరం.

ఇక తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ‘స్పెషల్ ఆపరేషన్’కు శ్రీకారం చుట్టింది.ఇందులో 1.పార్టీకి చెందిన అనుబంధ సంఘాలు ఆర్ఎస్ ఎస్,విశ్వహిందూ పరిషత్,హిందూవాహిని,భజరంగ్ దళ్ తదితర సంస్థలు,వ్యవస్థలన్నింటినీ ఇటీవలి కాలంలో ‘యాక్టివేట్’ చేశారు.హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఇటీవల దాదాపు 2000 మందితో జరిగిన ‘కవాతు’ ఒక సాక్ష్యం.2. టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తులు పెట్టుకొని ఏపీ లాగా తెలంగాణలోనూ ‘కూటమి’ గా బరిలోకి దిగడం.ఈ సమీకరణాల్లో బిఆర్ఎస్ ను కూడా కలుపుకొని పోవాలని ఢిల్లీలో వ్యూహరచన జరుగుతోంది.ఈ మేరకు ఢిల్లీలో బిఆర్ఎస్,బీజేపీల మధ్య ‘రహస్య మంతనాలు’ జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఇక ఒంటరిగా వెళితే కాంగ్రెస్ పార్టీని ఢీ కొనగలమా,లేదా అనే అంశంపై కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్టు తెలియవచ్చింది.

ఒంటరిపోరుతో ఫలితం లేకపోతే తప్పనిసరిగా ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలను తోసిపుచ్చలేమని కొందరు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.ముందుగా తమకు ప్రధాన శత్రువు ఎవరో కేసీఆర్ తేల్చుకోవలసి ఉన్నది.ఇది చాలా సున్నితమైన వ్యవహారం.బిజెపితో అంటకాగితే మైనారిటీ వర్గాల ఓట్లు కోల్పోతామన్న భయం ఉన్నది.అధికారం తమచేతికి రావాలంటే బలమైన ప్రత్యర్థి రేవంత్ తో తలపడడానికి బీజేపీ ఆశ్రయం తీసుకోవడంలో తప్పేముందన్న వాదన ఉంది.బీహార్ లో నితీష్ సారధ్యంలోని యునైటెడ్ జనతాదళ్,ఏపీలో తెలుగుదేశం వంటి పార్టీలు సెక్యులర్ పార్టిలే.ఎన్నికల అవసరార్ధం బీజేపీ జతకట్టాయి.అలాంటి ఉదాహరణలను చెప్పి జనాన్ని కన్విన్సు చేయడం కష్టం కాదని కేసీఆర్ మద్దతుదారులంటున్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 2028 ఎన్నికల నాటికి మూడు ప్రధాన పార్టీల పాత్ర కీలకం. తెలంగాణా సాధించిన పార్టీగా భారత రాష్ట్ర సమితి,కేంద్రంలో అధికారంలోనున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ, తెలంగాణను ఇచ్చినట్టు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలు ఓట్లను చీల్చుకుంటాయి.ఈ మూడు పార్టీలలో బిఆర్ఎస్ ఏదైనా కూటమిలో చేరుతుందా?అనే అంశం తేలవల్సి ఉన్నది.బిఆర్ఎస్ అంటరాని పార్టీ కాదు.గతంలో కాంగ్రెస్ తో,టిడిపితో పొత్తుపెట్టుకున్న అనుభవాలు కేసీఆర్ కు ఉన్నవి.కనుక బిఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయవచ్చునని ఇప్పుడే నిర్ధారించలేం.

ఓట్ల చీలిక ఎలా ఉన్నా తెలంగాణ సెంటిమెంటును రంగరించడానికి కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.ఎం.ఐ.ఎం పార్టీ ఏ ఎండకా గొడుగు పడుతుంది. ఇంతకు ముందు బిఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందంతో పోటీ చేసింది.వచ్చే అలాంటి ఒప్పందం కాంగ్రెస్ తో చేసుకోదన్న గ్యారంటీ లేదు.కాంగ్రెస్,బీజేపీ శిబిరాల మధ్య ‘యుద్ధం’గా ఎన్నికలు జరిగితే ఒక లెఖ్ఖ.బిఆర్ఎస్ ధైర్యం చేసి ఒంటరిగా రంగంలో దిగితే,మూడు శిబిరాల మధ్య భీకర సమరానికి అవకాశాలున్నవి.కాంగ్రెస్ పార్టీ,సిపిఐ,సీపీఎం,ఇతర లెఫ్ట్ గ్రూపులు,బహుజన సంఘాలు,బీజేపీ వ్యతిరేక లౌకిక శక్తులతో ‘ఐక్య సంఘటన’ కట్టి పోరాడే అవకాశాలున్నవి.