Site icon HashtagU Telugu

MLC Kavitha : బీజేపీని గడగడలాడించిన బీఆర్ఎస్ ప్రకటన!

Mlc Kavitha

Mlc Kavitha

భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీని గడగడలాడించిందని, బీఆర్ఎస్ స్థాపనను జీర్ణించుకోలేని బీజేపీ చౌకాబారు రాజకీయాలకు తెరదీసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసి ప్రజల ముందు ఉంచినందుకే తమపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని నిప్పులు చెరిగారు.

గురువారం ఉదయం హైదరాబాద్ లో తన నివాసం వద్ద విలేకరులతో కవిత మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ… దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చేకన్నా ముందు ఈడీ పోవడం గమనిస్తున్నామని చెప్పారు. ఇదేమీ కొత్త విషయం కాదని, గత కొన్నేళ్లుగా దేశ ప్రజలు ఈ పరిణామాలను గుర్తిస్తూనే ఉన్నారని అన్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి మోడీ కన్నా ముందు ఈడీ వచ్చిందని స్పష్టం చేశారు. “నా మీద కావచ్చు, మన మంత్రులు, ఎమ్మెల్యే మీద కావచ్చు ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమై, నీచమైన రాజకీయ ఎత్తుగడ తప్పా ఇందులో ఏమీ లేదు. దాన్ని మనం పట్టించుకోనవసరం లేదు. అయోమయానికి గురికావాల్సిన అవసరం అంతకన్నా లేదు” అని రాష్ట్రపజలకు తెలియజేశారు. ఎటువంటి విచారణ ఎదుర్కోడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. కేంద్ర సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకకుండా సమాధానాలు చెబుతామని, కానీ మీడియాలో లీకులు ఇచ్చి నాయకులకున్న మంచిపేరును చెడగొట్టాలని చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడుతారని స్పష్టం చేశారు. బీజేపీ చౌకాబారు ఎత్తుగడలను ప్రజలు తిప్పికొడుతారని అన్నారు.

రాజకీయ పంథాను మార్చుకోవాలని ప్రధాని మోడీకి కవిత హితవు పలికారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు ఏం చేస్తామో చెప్పుకొని గెలువాలి కానీ ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యం కలిగిన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సాధ్యపడదని తేల్చిచెప్పారు. “కాదూ కూడదు… అది చేస్తాం .. ఇది చేస్తామం… జైలులో పెటుతామంటే… పెట్టుకో. ఏమైతది ? భయపడేదేముంది. ఏం చేస్తారు ? ఎక్కువలో ఎక్కువ ఏం చేస్తారు … ఉరి ఎక్కిస్తరా ? ఎక్కువలో ఎక్కువ అయితే జైలులో పెడుతారు అంతే కదా.. జైల్లో పెట్టుకోండి. ” అని స్పష్టం చేశారు. ప్రజల అండ ఉన్నంతకాలంలో ఎవరికీ ఏమి ఇబ్బందిరాదని అన్నారు. బీజేపీ ఎన్ని చేసినా ప్రజలకు సేవడాన్ని విరమించబోమని, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడాన్ని ఆపబోమని స్పష్టం చేశారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రగతి పథంలో నడుస్తోందని, అటువంటి ప్రభుత్వన్ని పడగొట్టడానికి చేసిన కుట్రను ప్రజలు గమనించారని తెలిపారు. ఆ కుట్రను ప్రజల ముందు ఉంచినందుకు తన పైనే కాకుండా తమ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ ప్రయోగిస్తున్నారని తెలిపారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని, భయపడబోమని ప్రకటించారు.

Exit mobile version