బీజేపీ, టీఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు వైపులని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. రెండు పార్టీలు తమ ద్రోహపూరిత విధానాలతో తెలంగాణ బాధితుల మృతదేహాలపై రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందుదామని ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, యువకులు తప్పుడు నిర్ణయాలు తీసుకోని తమ ప్రాణాలు తీసుకుంటున్నారని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో నష్టపోతున్న అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, ప్రజల హక్కులకు కాంగ్రెస్ హామీగా ఉంటుందని రేవంత్ తెలియచేసారు.
కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో, రాష్ట్ ప్రభుత్వం తెచ్చిన 317 జీవోతో ఉద్యోగులు ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంటున్నారని, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు భరోసా కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారని రేవంత్ తెలిపారు. టీచర్ల ఆత్మహత్యలకు బీజేపీ, టీఆర్ఎస్ బాధ్యత వహించాలని, ఇప్పటికైనా ఆ వివాదాస్పద జీవోను రద్దుచేయాలని రేవంత్ రెండు పార్టీలను డిమాండ్ చేశారు.