Site icon HashtagU Telugu

Political Fight: ఇద్దరూ.. ఇద్దరే!

Kavitha

Kavitha

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది. తమ ప్రత్యర్థుల లోపాలను బయటపెట్టేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వ్యూహత్మక అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కె కవిత మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు కోసం కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తే తప్ప, జిల్లాలో పర్యటించడానికి రైతులు అనుమతించరని అన్నారు. గత కొన్ని నెలలుగా, టీఆర్‌ఎస్ నాయకుల పిలుపు మేరకు పసుపు రైతులు తమ పసుపు పంటను ఆర్మూర్‌లోని బీజేపీ ఎంపీ నివాసం ముందు పడేసి ఆందోళన చేశారు. కాగా టీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ సైతం ఏమాత్రం తగ్గడం లేదు. 2బీహెచ్‌కే యూనిట్లు, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి బీజేపీ కార్యకర్తలు, నివాసితులు కవిత నివాసం ఎదుట ఆందోళనకు దిగారు.

రైతులకు ఉచితంగా ఎరువులు అందజేస్తామన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ క్యాంపు కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు యూరియాను పారపోశారు. ఆ పార్టీ నేతలు కూడా సోషల్ మీడియాలో రాజకీయ దుమారం రేపుతున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ, అరవింద్ వైఫల్యాలను బయటపెట్టే నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని కవిత పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీజేపీ నేతల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. మరోవైపు ఎంపీ అర్వింద్ కూడా టీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటు కవిత, అటు అర్వింద్ నువ్వానేనా అన్నట్టగా వ్యవహరిస్తున్నారు. పైచేయి సాధించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోవడం లేదు. ఈ ఇద్దరి పొలిటికల్ ఫైట్ లో నెగ్గేదెవరో ప్రజలే తేల్చాల్సి మరి.

Exit mobile version