Munugodu : చంద్ర‌బాబుకు మునుగోడు టాస్క్?

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబుకు ప‌రోక్షంగా మునుగోడు టాస్క్ ను బీజేపీ ఉంచ‌నుంది. ఆ టాస్క్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన త‌రువాత బీజేపీ, టీడీపీ పొత్తుకు మార్గం సుగ‌మం కానుందని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని తాజా టాక్‌. ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు మ‌రోసారి గేట్లు తెరిచిన సంకేతాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 11:01 AM IST

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబుకు ప‌రోక్షంగా మునుగోడు టాస్క్ ను బీజేపీ ఉంచ‌నుంది. ఆ టాస్క్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన త‌రువాత బీజేపీ, టీడీపీ పొత్తుకు మార్గం సుగ‌మం కానుందని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని తాజా టాక్‌. ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు మ‌రోసారి గేట్లు తెరిచిన సంకేతాలు ఉన్నాయి. ఇంకో వైపు జాతీయ స్థాయిలో నితీష్ దూరం కావ‌డం కూడా బీజేపీకి చంద్ర‌బాబు అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబుకు మునుగోడు టాస్క్ అధిగ‌మించిన త‌రువాత లైన్ క్లియ‌ర్ చేయాల‌ని బీజేపీ అగ్ర‌నేత‌లు భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ పొత్తుకు ఆద‌ర‌ణ ల‌భించింది. పెద్ద‌గా చంద్ర‌బాబు ఆనాడు దృష్టి పెట్ట‌న‌ప్ప‌టికీ తెలంగాణ వ్యాప్తంగా 19 స్థానాల‌ను దిక్కించుకోవ‌డాన్ని బీజేపీ అధ్య‌య‌నం చేసింది. ఇప్ప‌టికే టీడీపీ సానుభూతి ఓట‌ర్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. ప్ర‌త్యేకించి న‌ల్గొండ‌, ఖ‌మ్మం, రంగారెడ్డి, హైద‌రాబాద్. మ‌హ‌బూబ్ న‌గ‌ర్, ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో ఓట‌ర్లు ఆ పార్టీకి ఉన్నారు. ప్ర‌స్తుతం మునుగోడు గెలుపు కోసం బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఆ క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు కోసం వ్యూహాల‌ను ర‌చిస్తోంది.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపు టీడీపీ సానుభూతి ఓట‌ర్లు అత్య‌ధికంగా ఉన్నారు. ఆ ఓటు బ్యాంకును చీల్చ‌డానికి నేరుగా చంద్ర‌బాబును ప్ర‌యోగించాల‌ని బీజేపీ ప్లాన్ చేస్తోంది. పైగా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దాలుగా టీడీపీ ఓట‌ర్లు ఉన్నారు. అక్క‌డ బీసీలు ఎక్కువ‌గా ఉన్నారు. తొలి నుంచి బీసీ ఓటు బ్యాంకు టీడీపీకి బ‌లంగా ఉండేది. ప్ర‌స్తుతం ఆ ఓటు బ్యాంకు టీఆర్ఎస్ వైపు ఉంది. దాన్ని తిరిగి పొంద‌డానికి చంద్ర‌బాబును ప్ర‌యోగించాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. అందులో భాగంగా తెర‌వెనుక చంద్ర‌బాబును ఉప‌యోగించుకోవాల‌ని వ్యూహాల‌ను ర‌చిస్తుంద‌ని మునుగోడు పూర్వ‌పు టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌.

మొత్తం మీద మునుగోడు తెలంగాణ రాజ‌కీయాల‌ను మాత్ర‌మే కాదు, ఏపీ రాజ‌కీయాల‌పైన ప్ర‌భావం చూపనుంది. రాబోవు రోజుల్లో టీడీపీ, బీజేపీ పొత్తుకు దిశానిర్దేశం చేయ‌నుంది. బీజేపీ మునుగోడు మీద ప్ర‌యోగిస్తోన్న చంద్రాస్త్రం ఎంత వ‌ర‌కు ప‌నిచేస్తుందో చూడాలి.