BJP Target: కేసీఆర్ పై బీజేపీ ఫోకస్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టిందా?

  • Written By:
  • Updated On - June 3, 2022 / 12:09 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టిందా? ఎందుకంటే కొన్నాళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు.. అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు అగ్రనాయకులంతా కేసీఆర్ పై విమర్శలు, తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు దిగే అవకాశముందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే కొన్నాళ్లుగా దేశంలో ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపించడం, అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది.

ఈడీ అడుగులు చూస్తే.. కశ్మీర్ లో ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నించింది. కర్ణాటకలో డీకీ శివకుమార్ ను అరెస్ట్ చేసింది. ఢిల్లీ విషయానికి వస్తే.. ఏకంగా మంత్రి సత్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేసింది. ఆ తరువాత విచారణకు రావాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఇదే వరుసలో చూస్తే.. కేసీఆర్ పై ఈడీ దృష్టి పెట్టి ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా ఈడీ ఉచ్చు బిగుసుకునే ఛాన్సుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కేసీఆర్ తో పాటు చాలామంది నేతల అక్రమ సంపాదన చిట్టా తమ వద్ద ఉందని.. సందర్భం వచ్చినప్పుడు బయటపెడతామని బీజేపీ నేతలు అప్పుడప్పుడు స్టేట్ మెంట్ ఇస్తుంటారు. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు మామూలే అనుకున్నా.. ఇప్పుడు మాత్రం సీన్ మారుతున్నట్టే కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. కుటుంబ పార్టీ లక్ష్యం.. రాష్ట్రాన్ని దోచుకోవడమే అని ప్రధాని మోదీ విమర్శిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ ఏటీఎంగా మార్చుకున్నారంటూ జేపీ నడ్డా విమర్శించారు. కేసీఆర్ నయా నిజాంగా మారారంటూ అమిత్ షా ఆరోపించారు. ఈ విమర్శల దాడి చూస్తుంటే.. కేసీఆర్ పై బీజేపీ స్పెషల్ గా ఫోకస్ పెట్టి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.