TPCC Chief Angry: బీజేపీ విడుదల చేసిన చార్జిషీట్ చూస్తుంటే గురివింద సామెత గుర్తొస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Angry) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పాలనపైన.. బీజేపీ కేంద్రంలో 10 ఏళ్ల పాలనపై మేము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మేము చర్చకు రెడీగా ఉన్నామని అన్నారు. పదేళ్ల బీజేపీ చీకటి పాలనపై వాళ్లకు మేము వేసే సవాల్ కు సిద్ధమా..? అని ప్రశ్నించారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతామని చెప్పారు. నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్ కు 15 లక్షల రూపాయలు వేస్తాం అన్నారు. వంద రోజుల్లో అన్ని రకాల ధరలు తగ్గిస్తాం అన్నారు. డాలర్ కు పోటీగా రూపాయి విలువ పెంచుతామని అన్నారు. 50 రూపాయలకే లీటర్ పెట్రోల్ అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతాం అన్నారు.. ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.
Also Read: CMRF New Record: సీఎంఆర్‌ఎఫ్‌లో కొత్త రికార్డు.. ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయం!
అనేక కాంగ్రెస్ రాష్ట్రాలలో అప్రజాస్వామిక పాలన చేసి ప్రభుత్వాలను కూల్చారు. దేశంలో 411 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీలనుంచి బీజేపీలోకి మార్చారు. దేశంలో 45 ఏళ్లలో లేని నిరుద్యోగ పరిస్థితిని కల్పించారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ.. పార్టీలను చీలుస్తూ రాజకీయ పబ్బం గడిపిన బీజేపీ ఇప్పుడు సుద్దాపూస మాటలు మాట్లాడుతుందన్నారు. బీజేపీ 2014, 2019, 2024 ఎన్నికల్లో ఇచ్చిన జాతీయ స్థాయి మేనిఫెస్టోలో తీసుకుని రండి. మేము మా 2023 మేనిఫెస్టో తీసుకుని వస్తామని సవాల్ చేశారు.
ఏడాదిలో ఏమి చేశామో చెబుతాం.. మీరు 11 ఏళ్లలో ఏమి చేశారో చెప్పండి. ఎక్కడ, ఎప్పుడు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటారు చెప్పండి. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి.. చార్జీ షీట్ సంగతి తేల్చుకుందాం. రూ. 21 వేల కోట్లతో రుణమాఫీ, రైతుపెట్టుబడికి రూ. 7600 కోట్లు, ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 10,500 కోట్లు, 42 లక్షల మంది రైతులకు భీమా కవరేజ్ కోసం రూ. 1400 కోట్లు, అకాల వర్షాలకు నష్టపోయిన 94 వేల రైతులకు ఎకరానికి 10 వేల రూపాయిలు ఇచ్చాం. ఇవేం బీజేపీ నాయకులకు కనపడటం లేదా? అని మండిపడ్డారు.