తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Nizamabad MP Dharmapuri Arvind) మరియు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Malkajgiri MP Etala Rajender) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఇద్దరు నేతలే ఆదివారం నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని సమాచారం. జూలై 1న అధికారికంగా కొత్త రాష్ట్ర అధ్యక్షుడి పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించనుంది.
ఈ పదవికి దరఖాస్తు చేసే వారిలో డీకే అరుణ, బండి సంజయ్, కరుణాకర్ రెడ్డి, రామచంద్రరావు వంటి కీలక నేతలు కూడా ఆసక్తి కనబరిచినప్పటికీ, చివరకు ప్రధానంగా ఈటల – అర్వింద్ మధ్యే పోటీ నడుస్తోందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇద్దరు తమ తమ సామర్థ్యాలను హైకమాండ్‌కు వివరించినట్టు తెలుస్తోంది. అర్వింద్ బలంగా ఉన్న నియోజకవర్గంతో పాటు ఉత్తర తెలంగాణలో పార్టీకి ప్రాతినిధ్యం వహించగా, ఈటల రాజేందర్ గతంలో మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందారు.
నూతన అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్ లో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి. నాయకుల సామర్థ్యం, సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు ఎన్నికల ప్రణాళికల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలకమైన ఈ పదవిపై పార్టీ నేతలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. జూలై 1న వెలువడే ప్రకటనపై కార్యకర్తల్లో ఆసక్తి గరిష్ఠ స్థాయికి చేరుకుంది.