Millon March: కేసీఅర్ పై పోరుకు సిద్ధంకండి – బండి సంజయ్

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కష్టపడి పనిచేద్దాం. అంతిమంగా బీజేపీ సారథ్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

  • Written By:
  • Publish Date - January 28, 2022 / 10:24 PM IST

‘తెలంగాణలో కేసీఆర్ పాలనపట్ల జనం విసిగిపోయారు. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమేనని జనం భావిస్తున్నరు. ఇటీవల వెల్లడైన అన్ని సర్వే సంస్థల నివేదికలు ఇదే చెబుతున్నయ్. ఈ విషయం తెలిసి కేసీఆర్ భయపడుతున్నరు. మనపై దాడులు చేయిస్తున్నడు. కేసులు పెట్టి జైలుకు పంపుతున్నడు. రాబోయే రోజుల్లో అధికార పార్టీ నుండి దాడులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అయినా భయపడే ప్రసక్త లేదు… జనం పక్షాన ఉంటూ ధైర్యంగా ఎదుర్కొందాం. రాబోయే రెండేళ్లు జనంలోనే ఉందాం…. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కష్టపడి పనిచేద్దాం. అంతిమంగా బీజేపీ సారథ్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని ఆదేశించారు.

• ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ శక్తివంతంగా తయారైంది. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. కేసీఆర్ నియంత-కుటుంబ-అవినీతి పాలనపై బీజేపీ చేస్తున్న పోరాటాలు జనంలోకి వెళుతున్నాయి. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమేనని జనం అర్ధం చేసుకున్నరు. ఇప్పటికి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చాం…ఈసారి బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇద్దామని జనం ఆలోచిస్తున్నరు. ఇటీవల వెల్లడైన ఏ సర్వే సంస్థ ఫలితాలే నిదర్శనం. దీనికి ప్రధాన కారణం బీజేపీ సమిష్టిగా చేస్తున్న ఉద్యమాలే. ప్రభుత్వం లాఠీఛార్జీలు చేసినా, కేసులు పెట్టినా. జైలుకు పంపుతున్నా…. భయపడకుండా జనం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే’’అని పేర్కొన్నారు.
• ‘‘సీఎం కేసీఆర్ కు ఈ విషయం అర్ధమై భయపడుతున్నడు. బీజేపీని అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నరు. అక్రమంగా కేసులు పెడుతున్నడు. దాడులు చేయిస్తున్నడు. కరీంనగర్ లో, నల్గొండ జిల్లాలో నాపైనా… నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ పై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. రాబోయే రోజుల్లో ఈ దాడులు ఇంకా అధిగమయ్యే ప్రమాదం ఉంది. అయినా సరే వెనుకంజ వేసేది లేదు. కేసీఆర్ కుట్రలను ధీటుగా ఎదుర్కొందాం. ప్రజల పక్షాన ఉంటూ ఐక్యంగా ఉంటూ పోరాడదాం.’’అని పిలుపునిచ్చారు.
• పార్టీ నేతలపై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నందున… అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నందున మోర్చాల నాయకులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తూ కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ విషయంలో మోర్చాల పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవాలని కోరారు.
• ‘‘రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఏ కష్టమొచ్చినా, ఆపదొచ్చినా ఆదుకునేందుకు జాతీయ నాయకత్వం సిద్దంగా ఉంది. స్పందించింది. కరీంనగర్ లో నాపైన, నిజామాబాద్ అరవింద్ పై దాడి జరిగిన వెంటనే జాతీయ నాయకత్వం స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు మొదలుకుని పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నరేంద్రమోదీ స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. పంజాబ్ ఘటనలో తన కాన్వాయ్ పై దాడి జరిగినా… ఆ అంశాన్ని పక్కనపెట్టి నరేంద్రమోదీ తనకు ఫోన్ చేసి అండగా నిలిచారు. జరిగిన ఘటన పూర్వాపరాలు తెలుసుకోవడంతోపాటు తెలంగాణలో బీజేపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.’’అని గుర్తు చేశారు. మోదీ బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, రాష్ట్రంలో ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా మేం ఉన్నామనే భావనను మోర్చాల నేతలు కల్పించాలని కోరారు.
• ఈ సందర్భంగా వివిధ మోర్చాలు రాబోయే కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. యువ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉద్యోగాల సాధన కోసం ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని కోరారు. ఈలోపు నిరుద్యోగులను, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్త్రతంగా పర్యటించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. త్వరలో మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. దీంతోపాటు ఉద్యోగాల కల్పనపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించాలని….యూనివర్శిటీల, హాస్టళ్ల, కోచింగ్ సెంటర్లను సందర్శించాలి.’’అని ఆదేశించారు.
• కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సీఎం రాసిచ్చిన లేఖను జనంలోకి తీసుకెళ్లాలని, కేంద్రం ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నా కొనుగోలు కేంద్రాలు ఎందుకు బంద్ చేస్తున్నారనే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వివిధ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి అంశాలపై ఓబీసీ మోర్చా… దళిత బంధు, దళితులకు మూడెకరాలు, పోడు భూములు సహా దళితులు, గిరిజన మోర్చాలు, మహిళలు, మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా, మైనారిటీ మోర్చా రాష్ట్ర నాయకత్వం ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయా మోర్చాలు జనంలోకి విస్త్రతంగా తీసుకెళ్లేందుకు ప్రచారం నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ అనారోగ్యంతో బాధపడుతున్న వివిధ మోర్చాల నేతలతో మాట్లాడుతూ వారికి భరోసా నిచ్చారు.