Site icon HashtagU Telugu

Telangana BJP : డీలాప‌డ్డ తెలంగాణ బీజేపీ.. మూడో స్ధానానికే ప‌రిమిత‌మా..?

What Happened in Telangana BJP disputes in Party Leaders

What Happened in Telangana BJP disputes in Party Leaders

తెలంగాణ‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ త‌న హ‌వా సాగించింది. అంత‌క‌ముందు జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నాలుగు ఎంపీ సీట్లు గెల‌వ‌డంతో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌నే భావ‌న ఆ పార్టీ నాయ‌కుల్లో క‌లిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో అలాంటి ప‌రిస్థితి లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఎమ్మెల్యే సీట్లు ఒక్క‌టి మాత్ర‌మే.. అది కూడా గోషామ‌హాల్ నుంచి ఎమ్మెల్యేగా రాజాసింగ్ త‌న సొంత ఇమేజ్‌తో గెలిచారు. మిగతా అన్ని చోట్లా కాషాయ పార్టీ కొట్టుకుపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు రావటంతో కమలం క్యాంపులో కాస్త కళ వచ్చింది. రాజా సింగ్ కు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తోడవ్వటంతో టీ అసెంబ్లీలో బీజేపీ బలం ‘ఆర్ఆర్ఆర్’ అయింది. అయిన‌ప్ప‌టికి తెలంగాణ కాంగ్రెస్ కంటే బీజేపీ ఏ మాత్రం బ‌ల‌ప‌డలేదు. తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. కేసీఆరే సీఎంగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై అలుపెరుగని పోరాటం చేస్తోంది మాత్రం.. గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీయే. ఇప్పటికిప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హస్తం పార్టీగానే ఉంది.

కేసీఆర్‌, క‌విత‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న బీజేపీ.. ఇంత‌వ‌ర‌కు వాటిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌నేది ప్ర‌జ‌ల్లో క‌లుగుతున్న ప్ర‌శ్న‌లు. దేశంలో హిమాచల్ మొదలు కర్ణాటక దాకా అనేక చోట్ల ఓడిపోతోన్న కమల దళం తెలంగాణలో ఏ మాత్రం ఎదిగే సూచనలు కనిపించటం లేదు. ఈటెల రాజేందర్ గెలిచాక ఆయనను చేరికల కమీటి అంటూ ఒకటి ఏర్పాటు చేసి దానికి నాయకుడ్ని చేశారు. అయినా చేరికలూ జరగలేదు. తీసివేతలు కాలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది టీ బీజేపీ పరిస్థితి. పైగా గత కొన్ని రోజులుగా తెలంగాణ కమలం పార్టీలో ముసలం పుడుతోంది. టీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ పోకడలు ఈటెల మొదలు ధర్మపురి అరవింద్ వరకూ చాలా మందికి నచ్చటం లేదట. ఈ విషయం వారు స్వయంగా అంగీకరించనప్పటికీ క్యాడ‌ర్‌లో మాత్రం గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

బీజేపీ దిల్లీ హైకమాండ్ వద్దకి బండి సంజయ్ వ్యతిరేకులు బృందంగా వెళ్లి రావటం కూడా బహిరంగ రహస్యమే. అలాగని వారి కోసం బండిని అధ్యక్ష పదవి నుంచీ తొలగిస్తారా.. మోదీ, అమిత్ షా అటువంటి నిర్ణయం తీసుకుంటారా అంటే అలాంటిదేమీ జ‌ర‌గద‌ని బీజేపీ నాయ‌కులు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిపోతోన్న వేళ ప్రెసిడెంట్ ని మార్చితే గందరగోళం అవుతుందనేది నేత‌ల వాద‌న‌గా ఉంది. బీఆర్ఎస్ ను అధికారంలోంచి దించి భాగ్యనగరంలో కాషాయ జెండా ఎగురవేస్తామని ప్రగల్భాలు పలికిన టీ బీజేపీ నాయకులు ఇప్పుడు అంతర్యుర్ధాలతో సతమతం అవుతున్నారు. మరోవైపు దిల్లీ కాషాయ పెద్దలు కేసీఆర్ కుమార్తె విషయంలో మొదట్లో తెగ హడావిడి చేశారు. కవితని అరెస్ట్ చేస్తాం అన్నట్టుగా వాతావరణం సృష్టించారు. ఇప్పుడు చూస్తుంటే లిక్కర్ కేసు మత్తు నీరుగారిన‌ట్లు అయిపోయింది.

కవిత అరెస్టు ఒట్టి మాటేనని బీజేపీలోని వారే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. కవిత ఎపిసోడ్ వల్ల జనం ముందు బీజేపీ చులకనైందని వారి ఆవేదన. బీఆర్ఎస్ తో గట్టిగా పోరాడేది బీజేపీ కాదు కాంగ్రెస్సేనని క్షేత్రస్థాయిలో జనం భావిస్తున్నారట. ప్రస్తుతానికి బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ ల తరువాతి స్థానంలో ఎక్కడో సుదూరంగా ఉన్న బీజేపీ ఆలు లేదు చూలు లేదు అన్న చందంగా అప్పుడే అనేక సమస్యలతో కుదేలవుతోంది. జనంలో నమ్మకం కలిగించలేక, పార్టీలోని నేతల్లో ఐకమత్యం తీసుకురాలేక కమల దళం చేతులు ఎత్తేస్తోంది. అందుకు మంచి ఉదాహరణే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావుల వ్యవహారం. మొదట్లో వారిద్దరూ కాషాయ కండువా కప్పేసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇంత వరకూ అది జరగలేదు. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత పొంగులేటి, జూపల్లి టీ కాంగ్రెస్ నాయకులతో టచ్ లోకి వచ్చారట. వారిని ఎలాగైనా పార్టీలోకి తీసుకోవాలని హస్తం పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే వలసలపై బీజేపీ పెట్టుకున్న ఆశలు ఆడియాశలే అవుతాయి. బీఆర్ఎస్ వద్దనుకున్న వారికి కాంగ్రెస్సే ఛాయిస్ గా మారుతుంది. బీజేపీ 2018లో మాదిరిగానే.. మరోసారి మూడు, నాలుగు సీట్లతో మూడో స్థానానిక పరిమితం అవుతుందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.