BJP Bike Rally: కేసీఆర్ అవినీతిపై ‘బండి’ రైడింగ్!

తెలంగాణ బీజేపీ ‘ప్రజా గోస ‌- బీజేపీ భరోసా’ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - July 21, 2022 / 05:29 PM IST

తెలంగాణ బీజేపీ ‘ప్రజా గోస ‌- బీజేపీ భరోసా’ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. యాత్రలో భాగంగా మొదటిరోజు గురువారం సిద్దిపేట జిల్లా నాంచార్ పల్లిలో బైక్ ర్యాలీ చేపట్టింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో సాగిన ర్యాలీ నాంచార్ పల్లి నుంచి బక్రి చెప్యాల వరకు కొనసాగింది. ‘‘ప్రజా గోస –బిజెపి భరోసా‘’ పేరుతో 10 రోజుల పాటు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నామని బండి ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కారు నిరంకుశ వైఖరితో ఎదుర్కొంటున్న సమస్యలను వెళ్లబోసుకున్నారని, అప్పులపాలైన తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా,  ఒకటో తారీఖున ఠంచన్ గా ఉద్యోగులకు జీతాలు రావాలన్నా బీజపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని బండి సంజయ్ అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ఇంజనీర్ అవతారమెత్తి రీడిజైన్ పేరుతో 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసి కట్టి ఊళ్లకు ఊళ్లను ముంచేసిండు అని బండి ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా ప్రజలు కేసీఆర్ ను పెంచి పెద్ద చేస్తే ఏమిచ్చిండు..? ఒక్క ఇల్లు ఇయ్యలే.. కొత్త రేషన్ కార్డు ఇయ్యలే.. కొత్తగా పెన్షన్ ఇయ్యలే.. అని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా లక్షల కోట్ల అప్పుల పాల్జేసిండు అని,  ప్రజల చేతికి చిప్ప మిగిల్చిండు. ఇక్కడున్న ప్రతి ఒక్క తలపై రూ.1.20 లక్షల అప్పుభారం మోపిండు అని బండి సంజయ్ అన్నారు. బైక్ ర్యాలీలో బండి సంజయ్ వెంట మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, అధికార ప్రతినిధులు జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్ రెడ్డి పాల్గొన్నారు.