Site icon HashtagU Telugu

JP Nadda: నడ్డా పర్యటనతో బీజేపీలో జోష్

BJP Chief

BJP Chief

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పర్యటనతో తెలంగాణలో పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. పాలమూరు జిల్లాలో జరిగిన సభ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపిందంటున్నాయి పార్టీ శ్రేణులు. దుబ్బాకలో ధమాకా జరిగిందన్నారు జేపీ నడ్డా. హుజూరాబాద్ లో హుజూర్ ఓడిపాయారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. నిజానికి బీజేపీ బయటకు బలంగా కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణపరంగా ఇంకా బలపడాల్సిన
అవసరముంది. కాకపోతే పార్టీ అధిష్టానం ఇస్తున్న మద్దతుతో కమలదళం పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

కేంద్రం హోంశాఖా మంత్రిగా, బీజేపీ అగ్రనేతగా చాలా బిజీగా ఉండే అమిత్ షా సైతం.. తెలంగాణకు గత మూడు, నాలుగేళ్లలో చాలాసార్లు వచ్చారు. పార్టీ తరపున పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంటే దేశ రాజకీయాల్లో అంత తలమునకలుగా ఉన్నా సరే.. తెలంగాణపై ఫోకస్ ను మాత్రం కోల్పోలేదు. దీనికి కారణం.. సౌత్ లో మరో స్టేట్ ను తమ ఖాతాలో వేసుకోవాలనే ఆలోచన. నాడు భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చినా.. ఈనెల 14న బండి సంజయ్ రెండోదశ పాదయాత్ర ముగింపు సభకు రాబోతున్నా.. అంతా పక్కా ప్లానింగ్ తో, పక్కా వ్యూహంతోనే. అంత పకడ్బందీగా స్కెచ్ వేసి మరీ అడుగులు వేస్తోంది బీజేపీ. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తరచుగా తెలంగాణకు రావడానికి కారణం.. క్షేత్రస్థాయిలో కాషాయదళానికి జోష్ ని ఇవ్వడం కోసమే.

ఆమధ్య బండి సంజయ్ దీక్ష చేసినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందంటూ దానిని కాస్తా బీజేపీ తనకు ప్లస్ గా మార్చుకుంది. ఆ సమయంలో బీజేపీకి చెందిన అగ్రనాయకత్వం అంతా బండి సంజయ్ కు బాసటగా నిలిచింది. ప్రధాని మోదీ మొదలు, అమిత్ షా, జేపీ నడ్డా.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలు అంతా బండికి సపోర్ట్ ఇచ్చారు. అంటే తమ పార్టీ వారికి కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఆదుకోవడానికి తామంతా ఉన్నామన్న భరోసాను పార్టీ కల్పిస్తోంది. అందుకే కార్యకర్తలు.. ఈ స్థాయిలో గులాబీదళంతో ఎన్నికల రణక్షేత్రంలో పోరాడగలుగుతున్నారంటున్నారు విశ్లేషకులు.

Exit mobile version