BJP: బీజేపీ త‌ర్వాత టార్గెట్.. రెండు తెలుగు రాష్ట్రాలేనా..?

  • Written By:
  • Updated On - March 11, 2022 / 04:52 PM IST

ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎన్నిక‌ల ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై వ్య‌తిరేక‌త విప‌రీతంగా పెరిగిపోయింద‌ని ప్ర‌తిప‌క్షాలు అంచ‌నా వేయ‌డ‌మే కాదు , ప్ర‌చారంలో భాగంగా తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే.. వారి అంచ‌నాల‌న్నీ త‌లకిందుల‌య్యాయి. ఈ క్ర‌మంలో ఉత్త‌రాదిన‌ క‌మ‌లం పార్టీకి తిరుగులేద‌ని అర్థ‌మైపోయింది.

ఈ నేప‌ధ్యంలో ఇప్పుడు బీజేపీ ద‌క్షిణాది పై దృష్టి కేంద్రీక‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. క‌ర్నాట‌క‌లో ఇప్ప‌టికే బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి అక్క‌డ ప‌ట్టు సాధించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి ప‌ట్టు కోసం చాలాకాలంగా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ‌లో బలపడాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింద‌ని చెప్పొచ్చు.

తెలంగాణ‌లో గ‌త పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెల్చుకుని సంచలనం సృష్టించిన బీజేపీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించి ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతుంది. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ, కేసీఆర్‌ను గ‌ద్దె దింపేందుకు పాచిక‌లు సిద్ధం చేస్తుంది. ఈ క్ర‌మంలో ముందుగా రాష్ట్రంలో స‌ర్వేలు నిర్వ‌హించి, ఆ త‌ర్వాత అధికార పార్టీ నుంచి ఫిరాయింపులకు తెర‌లేపాల‌ని బీజేపీ అధిష్టానం భావిస్తుంద‌ని స‌మాచారం.

బెంగాల్‌లో త‌ప్పా మిగ‌తా చోట్ల బీజేపీ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యి, ప‌లు రాష్ట్రాల్లో కాషాయం జెండా పాతింది. ఈ క్ర‌మంలో జూలైలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు పూర్త‌య్యాక తెలంగాణ‌లో యాక్ష‌న్ స్టార్ట్ చేసేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతుంది. ఇక మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం బీజేపీకి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టు దొర‌క‌లేద‌నే చెప్పాలి. తెలంగాణ ఉన్న‌ట్టు, ఏపీలో బీజేపీకి పొటెన్షియ‌ల్ లీడ‌ర్లు లేక‌పోవ‌డం ఒక కార‌ణం అయితే, ఏపీలో అధికారంలో ఉన్న జ‌గ‌న్ స‌ర్కార్ బీజేపీ ప్ర‌భుత్వానికి పూర్తిగా స‌హ‌క‌రించ‌డం మ‌రో కార‌ణం.

అంతే కాకుండా ఏపీలో ఉన్న ప్ర‌తిప‌క్షాలు కూడా బీజేపీతో శ‌త్రుత్వం పెట్టుకునేందుకు సాహ‌సం చేసే ప‌రిస్థితుల్లో ఏ పార్టీ కూడా లేదు. దీంతో ఏపీలో ప‌ట్టు సాధించేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహాలు అమ‌లు చేస్తాయ‌నేదానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొని ఉంది. ఎందుకంటే బీజేపీ వ్యూహాలు అంచ‌నా వేయ‌డం అంత ఈజీ అయితే కాదు. అయితే ముందు తెలంగాణ‌ను టార్గెట్ చేసుకుని, అక్క‌డ ల‌క్ష్యాన్ని రీచ్ అయిన త‌ర్వాత‌, ఆంధ్ర పై దృష్టి సారించే అవ‌కాశం ఉంద‌ని రాజకీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఏది ఏమైనా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత, మ‌రింత బ‌లం పుంజుకున్న బీజేపీ క‌న్ను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌పై ప‌డిన నేప‌ధ్యంలో, ఏపీ అండ్ తెలంగాణ‌లో బీజేపీ పాచిక‌లు పార‌తాయో లేదో చూడాలి.