Site icon HashtagU Telugu

TRS Vs BJP : కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టడానికి బీజేపీ కొత్త స్కెచ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఇరుకున పెట్టాలని బీజేపీ భావించింది. కానీ సమావేశాల తొలిరోజే వారికి ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. స్పీకర్ పోచారం వారిని సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అది సెషన్ మొత్తం అమల్లో ఉంటుందని తెలియగానే.. బీజేపీ భగ్గుమంది. కానీ అంతే వేగంగా మరో స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ సత్తా ఏమిటో ట్రిపుల్ ఆర్ చూపిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలోనే చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయ్యేసరికీ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ద్వారా బీజేపీకి ఏమేరకు లబ్ది చేకూరుతుందో చెప్పలేకపోయినా.. ఈ సస్పెన్షన్ వల్ల బీజేపీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ కమలంపై సానుభూతి పెరిగిందంటున్నారు. అందుకే తమకు జరిగిన అన్యాయంపై ప్రజాసభలోనే తేల్చుకోవడానికి వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.

లెక్కలు, ఆధారాలతో సహా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎమ్మెల్యేలు పోరాడుతారని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అందుకే సభ జరిగనన్నాళ్లూ ప్రజల్లోకి వెళ్లేలా కొత్త
కార్యక్రమాలను సిద్ధం చేస్తు్న్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ లో కీలకపాత్ర పోషించి.. మంత్రిగా సేవలందించి.. అధికారంలోకి వచ్చిన తరువాత ఈటెల్ రాజేందర్ తొలిసారిగా బీజేపీ సభ్యుడిగా సభలో అడుగుపెట్టారు. దీంతో టీఆర్ఎస్ సర్కార్ ను ఇరుకునపెట్టడానికి ఆయన ప్రత్యేకంగా వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. కానీ ఈటెలకు ఆ అవకాశం ఇవ్వకుండానే టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. మరిప్పుడు ఈటెల రూటేంటి?

ఏదేమైనా టీఆర్ఎస్ సర్కార్ చేసిన పనితో బీజేపీకి నష్టంకన్నా లాభం ఎక్కువగా జరిగినట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ప్రజల్లో సానుభూతి పెరిగి.. అది ఓట్ల రూపంలో లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ కూడా దీనిని క్యాష్ చేసుకునే పనిలో పడింది.