Site icon HashtagU Telugu

BJP MP Laxman: ఖర్గేజీ నిజాలు తెలుసుకోండి.. ఇది నయా భారత్ : ఎంపీ లక్ష్మణ్

Bjp Mp K Laxman Congress Chief Kharge India Indian Economy Pm Modi

BJP MP Laxman : ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిన వేళ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలను బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ఖండించారు. నిజానిజాలను మర్చిపోయి ఖర్గే నోరు పారేసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.  11 సంవత్సరాల క్రితం వరకు జరిగిన కాంగ్రెస్ పాలనలో భారతదేశం ప్రపంచంలోని ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండేదని లక్ష్మణ్ గుర్తుచేశారు. ప్రధాని మోడీ విజన్, పారదర్శక  పాలన వల్లే భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. మోడీ సర్కారులో అవినీతికి తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ప్రోత్సాహంతో దేశంలో వందలాది స్టార్టప్‌లు, యూనికార్న్‌లు ఏర్పడ్డాయన్నారు. భారత్‌లోని ప్రతీ వ్యక్తి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలనేది మోడీ ఆశయమని లక్ష్మణ్ పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ మాటలను గుర్తు చేస్తూ.. 

‘‘ప్రధాని మోడీ పాలనలో సంక్షేమ ఫలాలు నేరుగా దేశంలోని పేద ప్రజలకు చేరాయి. ప్రభుత్వ డెవలప్‌మెంట్ కార్యక్రమాలతో పేదలు లబ్ధి పొందారు. దాదాపు రూ.35 లక్షల కోట్లు నేరుగా దేశ ప్రజల ఖాతాల్లోకి చేరాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను తీసుకొచ్చిన ఘనత మోడీదే’’ అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ (BJP MP Laxman) తెలిపారు. ‘‘ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవినీతి గురించి ఒకసారి స్వయంగా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.100 పంపిణీ అయితే, అందులో సదరు పేద కుటుంబానికి రూ.15 మాత్రమే చేరుతున్నాయని రాజీవ్ గాంధీ చెప్పారు. మిగతా  రూ.85ను మధ్యవర్తులు నొక్కేస్తున్నారని రాజీవ్ ఆనాడు తెలిపారు’’ అని  కె లక్ష్మణ్ వివరించారు. ప్రధాని మోడీ పారదర్శక పాలనా విధానాలు, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ఈ అవినీతిని రూపుమాపారని చెప్పారు.

Also Read :Kavitha Padayatra : జూన్ 2న కవిత కీలక ప్రకటన.. పాదయాత్రకు ప్లాన్.. తెలంగాణ జాగృతిపై ఫోకస్

ఇది నయా భారత్.. ఉగ్రవాదుల అంతుచూస్తాం

‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత్‌లో పెద్దసంఖ్యలో ఉగ్రదాడులు జరిగేవి. ఉగ్రదాడులు జరిగినప్పుడు కాంగ్రెస్ సర్కారు మౌనంగా ఉండిపోయేది. నాటి పాలకులే తీవ్రవాదులతో చర్చలు జరిపేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది నయా భారత్. దీని సారథి నరేంద్ర మోడీ. ఇప్పుడు ఉగ్రదాడులు జరిగితే.. వెంటనే భారత సైన్యం ఎటాక్ చేస్తుంది. ఉగ్రవాదుల అంతు చూస్తుంది. వాళ్లను మట్టిలో కలుపుతుంది. ఇది భయం ఎరుగని సాహసోపేత భారత్’’  అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు.

మోడీకి దేశ ప్రజల ఆశీర్వాదం

‘‘ప్రధాని మోడీ పాలనా విధానాలు సక్సెస్ అయ్యాయి. అందుకే దేశంలో పెద్దసంఖ్యలో స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయి. పెద్దసంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతోంది. భారత్‌లోని రోడ్డు, రైలు, జల, విమానయాన సర్వీసులు చాలా మెరుగయ్యాయి. ఇవన్నీ చూసి దేశ ప్రజలు మళ్లీమళ్లీ మోడీకే పట్టం కడుతున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమే పదేపదే అధికారంలోకి వస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పదేపదే ఓడిపోతోంది. ఈవిషయాలను కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలుసుకోవాలి’’ అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.