BJP MP Etala Rajender: సీఎం రేవంత్ సర్కార్‌పై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటర రాజేందర్ (BJP MP Etala Rajender) ఫైర్ అయ్యారు. మూసీ నిద్ర ముగింపు సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలతో గోక్కున్నోడు ఎవడూ ముందల పడలేదు. ఎక్కడ పోతావ్ రేవంత్ నీకు అధికారం ఇచ్చింది ఐదేళ్ల కోసమే.. అప్పుడే సంవత్సరం అయ్యింది. మిడిసిపడకు. నీ అధికారం హోదా ఆస్తులు అంతస్తులు నువ్వు పోయినప్పుడు నీ వెంట రావు. మంచి పేరు తెచ్చుకో కానీ తూ.. ఈయననా అనిపించుకోవద్దు. ప్రజల ఆశీర్వచనం తెచ్చుకో అని అన్నారు.
నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. 25 ఏళ్ళుగా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని చూసిన వాడిగా మాట్లాడుతున్న. మల్లన్న సాగర్ బాధిత రైతులు అడ్డా మీద కూలీలుగా మారారు. ఎయిర్‌పోర్టుకి భూములు ఇచ్చిన వారు అదే ఎయిర్‌పోర్టులో టాయిలెట్స్ కడిగే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. అహంకార పూరిత మాటలతో మీరు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరిస్తున్నా. ప్రజలు మీవెంట పడే రోజు దగ్గర్లోనే ఉంది. బుల్డోజర్లు వచ్చేది మా మీదకు కాదు మీ మీదకు. కాంగ్రెస్ ను పాతరేసే రోజు వస్తుందని మండిపడ్డారు.
Also Read: Navneet Rana : బీజేపీ నేత నవనీత్ రాణాపై కుర్చీలతో దాడి.. ఏమైందంటే..
గత 5 నెలలుగా హైదరాబాద్ ప్రజలకు కంటిమీద కునుకు లేదు. చెరువుల పక్కన ఉన్న ఇళ్లు కూల్చారు. కనీసం నోటీసు ఇవ్వలేదు. ఇంట్లో సామాను తీసుకొనే సమయం ఇవ్వకుండ బూటుకాళ్లతో తన్నారు. ఈ సీఎం ఏదో ఉద్దరిస్తారని ఓటు వేస్తే మా గూడు లేకుండా చేసి మా బ్రతుకుల్లో మట్టి కొడుతున్నారని వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. లక్షన్నర కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తాం అంటాడు. మళ్లీ ఎవడు అన్నాడు అంటాడు.
ఇప్పుడే డీపీఆర్ కోసం ఇచ్చా అంటారు. మరి డీపీఆర్ లేకముందే ఎలా మార్కింగ్ ఇచ్చావు అంటే సమాధానం లేదు. తొమ్మిది నెలల గర్భవతి గీత.. డెలివరీ అయ్యేంత వరకు ఆగమంటే ఆగలేదు. ఆమెను చూసి కూడా చలించలేదు. టైలరింగ్ చేసుకునే మహిళ ఆమె భర్తచనిపోతే ఊర్లో ఉన్నదంతా అమ్ముకుని వచ్చి ఇక్కడికివచ్చి షశ్రీడ్డు వేసుకొని ఉంటుంది. ఆమె ఏడుపును ఎవరూ ఆపలేకపోతున్నారు. మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకున్నాడు. ఇంకొకరు ఉరి వేసుకున్నారు. లక్ష్మమ్మ అనే ఆవిడకు హార్ట్ అటాక్ వచ్చింది. యాదిరెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇందుకా మీకు ఓటు వేసిందని ఈ ప్రజలు అడుగుతున్నారని ప్రశ్నించారు.
వీరికి మద్దతుగా మేం వస్తే.. రాజేందర్ పిచ్చి కుక్క కరిచి చచ్చిపోతావ్ అంటాడు. పేదలకు ప్రశాంతత లేకుండా చేశారు. సీఎం సొంత నియోజకవర్గం లగిచర్లలో తల్లిని బిడ్డను వేరుచేసినట్టు మా భూములు గుంజుకోవద్దని మొరపెట్టుకున్నా వినలేదు. బలవంతంగా అధికారులను పంపిస్తే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దళిత గిరిజన రైతులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి సంకెళ్లు వేసి ఇబ్బంది పెట్టారు. ఎంపీ డీకే అరుణని అడ్డుకున్నారు. కానీ సీఎం సోదరుణ్ణి మాత్రం 50 కార్లతో పంపించారు. ఆయన వెళ్ళి భూములు ఇవ్వకపోతే మీ వాళ్ళు జైలునుండి బయటకి రారు అని బెదిరిస్తున్నారు అంటే ఎటు పోతున్నామని అసహనం వ్యక్తం చేశారు.