Site icon HashtagU Telugu

Eatala Rajendar : ‘రియల్’ బ్రోకర్‌పై ఈటల రాజేందర్‌, అనుచరుల ఎటాక్.. ఎందుకు ?

Bjp Mp Eatala Rajendar Real Estate Broker

Eatala Rajendar : ఒక రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఏకశిలా నగర్‌లో ఖాళీగా ఉన్న 149 ఎకరాలను గతంలో ఇళ్ల స్థలాలుగా కేటాయించారు.  ఈ స్థలాలను పొందిన వారిలో కొందరు వాటిని ఇతరులకు అమ్ముకున్నారు. మరికొందరు ఇళ్లు కట్టుకున్నారు. ఈ క్రమంలో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలాలకు పత్రాలను సృష్టించారు. వాటిని చూపించి స్థానికులను బెదిరిస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి ఈటలకు ఫిర్యాదు అందింది. దీంతో ఆయన నేరుగా ఏకశిలానగర్‌‌కు వెళ్లారు. ఆవేశానికి గురైన ఈటల.. పేదల భూములు కబ్జా చేస్తావా అంటూ సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంప ఛెళ్లు మనిపించారు. ఆ వెంటనే ఈటల(Eatala Rajendar) వెంటనున్న స్థానికులు, ఈటల అనుచరులు కలిసి సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి చేశారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది.

Also Read :Woman DNA Mystery : వైద్యురాలి డెడ్‌బాడీపై మహిళ డీఎన్ఏ.. ఎలా ? ఎక్కడిది ?

అనంతరం విలేకరులతో ఈటల రాజేందర్ మాట్లాడారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సదరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వల్ల  స్థానికులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. అతడు పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పేదల్ని వేధిస్తున్నాడని ఈటల ఫైర్ అయ్యారు. పేదలంతా దాదాపు 40ఏళ్ల క్రితం కొన్న స్థలాల్లో.. ఇళ్లు కట్టుకోకుండా అడ్డుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారి అడ్డుకోవడం సరికాదన్నారు. నకిలీ పత్రాలతో ప్రజలను వేధించడం మంచిది కాదని ఈటల సూచించారు. హైదరాబాద్‌ అరుంధతి నగర్‌, బాలాజీ నగర్‌, జవహర్‌ నగర్‌లలో కూడా ఇలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేశారని ఆయన ఆరోపించారు. 40 గజాలు, 60గజాల స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటే వాటిని కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రెవెన్యూ మంత్రి, కలెక్టర్‌, సీపీతో కూడా మాట్లాడానని చెబుతూ గత ఆరు నెలలుగా నిత్యం ఏకశిలానగర్‌లో ఇళ్లను కూలుస్తున్నారు.జాగాలు లాక్కుంటున్నరు. ప్రజల స్థలాల్లో మద్యం సేవిస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారు. అవన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చా’’ అని ఈటల తెలిపారు. పేదల కన్నీళ్లను పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ‘‘బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడదు. అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు’’ అని ఈటల చెప్పారు.

Also Read :Maoist Chalapathi : మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఎన్‌కౌంటర్‌.. ఆయన నేపథ్యం ఇదీ

‘‘1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను. తప్పు భూములు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు బ్రోకర్లది’’ అని ఈటల తేల్చి చెప్పారు. ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.