TRS vs BJP: టీఆర్ఎస్ వ్యూహం అదుర్స్.. గొంతు ఎత్త‌క ముందే గెంటేశారు..!

  • Written By:
  • Publish Date - March 7, 2022 / 04:26 PM IST

తెలంగాణ‌లో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈరోజు ప్రారంభ‌మయిన సంగ‌తి తెలిసిందే. అయితే తొలిరోజే అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం దెబ్బ‌కి ప్ర‌తిప‌క్ష బీజేపీ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఈ క్ర‌మంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేందర్.. ముగ్గురు స్ప‌స్పెండ్ అయ్యారు. స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డు త‌గులుతున్నార‌నే కార‌ణంతో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఈ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేశారు.

అయితే పార్టీ కీల‌క ఎమ్మెల్యేల‌ను ఈరోజు మాత్ర‌మే స‌భ నుంచి స‌స్పెండ్ చేస్తున్నార‌ని భావించిన బీజేపీకి దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తూ.. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసేవ‌ర‌కు ఈ ముగ్గురు స‌భ్యుల‌ను సస్పెండ్ చేస్తున్న‌ట్టు స్పీక‌ర్ పోచారం ప్ర‌క‌టించారు. ఇక తెలంగాణ బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డు తగులుతున్నారని, వారిని సస్పెండ్ చేయాలని మొద‌ట‌ మంత్రి తలసాని శ్రీనివాయస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా, ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావులను సస్పెండ్ చేస్తూ స్పీక‌ర్ పోచారం ఆదేశాలిచ్చారు. ఈ క్ర‌మంలో సెషన్ పూర్తయ్యే వారికి సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక మ‌రోవైపు అసెంబ్లీ నుంచి తమను ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారని స‌స్పెండ్ అయిన‌ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తమను సస్పెండ్ చేశారని అసెంబ్లీ ఎదుట బైఠాయించిన‌ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీంతో ఆందోళన విరమించకపోవడంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలి రోజే రోజే బీజేపీ పార్టీ వ్యూహాలకు అధికార టీఆర్ఎస్ చెక్ పెట్టింది. నేటి అసెంబ్లీ స‌భ‌లో టీఆర్ఎస్ పాలన పై విరుచుకుప‌డ‌దాని అనుకున్న బీజేపీకి టీఆర్ఎస్ ఊహించ‌ని విధంగా పెద్ద షాకే ఇచ్చింది.

ఇక అసెంబ్లీలో కేసీఆర్‌కు ట్రిపుల్ ఆర్ (రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్) సినిమా చూపిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించారు. అలాగే టీఆర్ఎస్ నుండి అవమానకరంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈటల రాజేందర్, అసెంట్లీలో తొలిసారి మరోపార్టీ నేతగా సీఎం కేసీఆర్‌ను ఎలా ఎదుర్కుంటారో చూద్దామని బీజేపీ నేతలతో పాటు హుజురాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఈసారి వాడి వేడిగా సాగ‌డం ఖాయ‌మ‌ని సర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూశారు. అయితే బీజేపీ వేసిన ప్లాన్‌ను చిత్తు చేస్తూ, టీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా ఆ ముగ్గురు బీజేపీ స‌భ్యులను స‌స్పెండ్ చేసింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఈట‌ల రాజేందర్ భావించారు. అయితే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అసెంబ్లీలో వారి గొంతు వినిపించక ముందే సస్పెన్షన్ వేటు వేసి గెంటేసింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.