ఎమ్మెల్యే రాజాసింగ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ మేరకు ఆయన్ను జైల్లో పెట్టారు. ఎలాంటి సంఘటనలను జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రాజాసింగ్ ను జైలుకు తరలించారు. ఉద్రిక్తతల నడుమ నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఆయన మీద పోలీసులు పీడీ యాక్ట్ ను నమోదు చేశారు. రౌడీషీట్ ను ఓపెన్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం రాజా సింగ్‌ను ఆయన ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్న మంగళ్ హాట్, షాహినాయత్ గంజ్ పోలీసులు నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం రాజా సింగ్‌ను చర్లపల్లి జైలుకు పంపారు.
రాజా సింగ్ అరెస్ట్, కోర్టుకు తరలింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భారీగా బలగాలను మోహరించారు. రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రాజా సింగ్‌కు 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన తరువాత ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత రాజా సింగ్‌ను రహస్య ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా చెప్పిన పోలీసులు ఆ తర్వాత వ్యూహం మార్చి నాంపల్లి కోర్టుకు తరలించారు. ప్రస్తుతానికి చర్లపల్లికి రాజాసింగ్ ను పంపడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, రాబోవు రెండు రోజుల్లో మత ఘర్షణలు జరుగుతాయని బీజేపీ చీఫ్ బండి చేసిన ఆరోపణల దృష్ట్యా పోలీసులు అప్రమత్తం అయ్యారు. పాతబస్తీతో పాటు హైదరాబాద్ అంతటా అలెర్ట్ అయ్యారు.