Hyd Minor Gang Rape : `గ్యాంగ్ రేప్ ` పై రాజ‌కీయ ద‌ర్యాప్తు

హైద‌రాబాద్ న‌డిబొడ్డున మైన‌ర్ బాలిక‌పై క‌దిలేకారులో జ‌రిగిన గ్యాంగ్ రేప్ రాజ‌కీయ రచ్చ‌లోకి వెళ్లింది

  • Written By:
  • Updated On - June 7, 2022 / 01:39 PM IST

హైద‌రాబాద్ న‌డిబొడ్డున మైన‌ర్ బాలిక‌పై క‌దిలేకారులో జ‌రిగిన గ్యాంగ్ రేప్ రాజ‌కీయ రచ్చ‌లోకి వెళ్లింది. ఆ కేసు దర్యాప్తు ను పోలీసులు ప‌క్క‌దోవ ప‌ట్టించార‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌. అధికార టీఆర్ఎస్ పార్టీ దాని స‌హ‌జ మిత్ర పార్టీ ఎంఐఎం కు చెందిన ఎమ్మెల్యేల పిల్ల‌లు గ్యాంగ్ రేప్ లో ఉన్నార‌ని విప‌క్షాలు చేస్తోన్న విమ‌ర్శ‌లు . వాటికి చెక్ పెట్టేలా తెలంగాణ పోలీసులు మీడియా ముందుకొచ్చారు. అధికార పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల కుటుంబీకుల పిల్ల‌లు ఎవ‌రూ లేర‌ని పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. స‌రిగ్గా ఇదే టైంలో లాయ‌ర్, బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.

అధికార పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ కుటుంబీకుల పిల్ల‌లు గ్యాగ్ రేప్ లో ఉన్నార‌ని చెబుతూ ఒక వీడియోను కొన్ని ఫోటోల‌ను విడుద‌ల చేశారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసు విచార‌ణ‌ను పోలీసులు ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నార‌ని విప‌క్షాలు చేసిన ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరేలా ర‌ఘునంద‌న్ విడుద‌ల చేసిన వీడియో, ఫోటోలు ఉన్నాయి. దీంతో పోలీసుల ద‌ర్యాప్తు మీద ఒత్తిడి పెరిగింది. గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ల‌లో ఇద్ద‌రు మైన‌ర్లు ఉన్నారంటూ వాళ్ల‌ను జునైల్ హోంకు పంపారు. మిగిలిన ఇద్ద‌ర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచార‌ణ చేస్తున్నారు. మొత్తం ఐదుగురు గ్యాంగ్ రేప్ లో పాల్గొన్న‌ట్టు ప్రాథ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. కానీ, టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు కుటుంబీకుల పిల్ల‌ల‌ను ఎఫ్ ఐఆర్ నుంచి త‌ప్పించార‌ని విప‌క్షాలు ఆందోళ‌న కొన‌సాగిస్తున్నాయి. మ‌హిళా సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌కు చెందిన మ‌హిళా విభాగాల లీడ‌ర్లు పోలీసుల స్టేష‌న్ల ముట్ట‌డికి ప్ర‌య‌త్నించాయి. దీంతో ఆ కేసు విచార‌ణ గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. దీనంత‌టికీ ర‌ఘునంద‌న‌రావు కార‌ణంగా అధికార‌ప‌క్షం భావిస్తోంది.

గ్యాంగ్ రేప్ పై విచార‌ణ ను స‌వాల్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ పై రివ‌ర్స్ కేసు న‌మోదు చేశారు. ఆయ‌న విడుద‌ల చేసిన వీడియో ద్వారా బాధితురాలు బ‌ద్నాం అయింద‌ని పోలీసులు భావించారు. అందుకే ఆయ‌న పై కేసు న‌మోదు చేయ‌డంతో పాటు అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. భార‌త శిక్షాస్మృతి ప్ర‌కారం రేప్ బాధితురాలి ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌పెట్ట‌డానికి లేదు. చ‌ట్ట విరుద్ధంగా వీడియోను బ‌య‌ట పెట్ట‌డం ద్వారా బాధితురాల్ని చూపించినందుకు ఇప్ప‌టికే ప‌లు యూట్యూబ‌ర్స్, వెబ్ సైట్ నిర్వ‌హకుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వాళ్ల‌ను విచారిస్తోన్న పోలీసులు ఆక‌స్మాత్తుగా ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు మీద కేసు పెట్ట‌డ‌డం కొత్త మ‌లుపు తిరిగింది.

యూట్యూబ‌ర్స్, వెబ్ సైట్ నిర్వాహ‌కుల‌కు ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు నుంచి గ్యాంగ్ రేప్ వీడియో ఫుటేజ్ అందింద‌ని పోలీసులు అనుమానం. ఆయ‌న నుంచి వెళ్లిన రేప్ వీడియోల‌ను వివిధ యూట్యూబ‌ర్స్ త‌మ ఛాన‌ళ్ల‌లో అప్ లోడ్ చేశారు. దీంతో బాహ్య ప్ర‌పంచానికి బాధితురాలు తెలిసిపోయింది. స‌రిగ్గా ఇక్క‌డే ర‌ఘునంద‌న రావు చ‌ట్టాన్ని ధిక్క‌రించార‌ని పోలీసులు భావిస్తున్నారు. అందుకే, ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తుకు దిగారు. దీంతో క‌దిలేకారులో జ‌రిగిన గ్యాంగ్ రేప్ ద‌ర్యాప్తు నాన్ సీరియ‌స్ గా మారింద‌ని విప‌క్షాలు భావిస్తున్నాయి. ఇదంతా అధికార‌ప‌క్షం గ్యాంగ్ రేప్ కేసును ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డమేన‌ని విమ‌ర్శిస్తున్నారు. మీడియా స‌మావేశంలో ర‌ఘునంద‌న్ రావు విడుద‌ల చేసిన వీడియో, ఫోటోల్లో ఎక్క‌డా బాధితురాలి ముఖంగానీ, శ‌రీరంగానీ క‌నిపించ‌కుండా మార్ఫింగ్ చేశారు. అదే విష‌యాన్ని ఆయ‌న చెబుతున్నారు. మ‌రి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారో చూడాలి.