Site icon HashtagU Telugu

Ponguleti Srinivas Reddy: ఖమ్మం వేదికగా బీజేపీ రాజకీయం

Ponguleti Srinivas Reddy

Whatsapp Image 2023 05 05 At 11.10.19 Am

Ponguleti Srinivas Reddy: తెలంగాణాలో ఖమ్మం వేదికగా రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ కు పట్టు లేని ఉమ్మడి ఖమ్మం నియోజకవర్గంపై బడా నేతలు కన్నేశారు . అక్కడినుంచే ఈ సారి రాజకీయం రసవత్తరంగా సాగేలా కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాపులారిటీ ఎక్కువ. అక్కడ ఆయనకు గల్లీ నుంచి జిల్లా వరకు వేలాదిమంది సమూహం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన పొంగులేటి ప్రస్తుతం ఖమ్మం నుంచి తన కార్యాచరణను మొదలుపెట్టనున్నరు. ఇప్పటికే ఆయన అనుచర వర్గం అధికార పార్టీ నుంచి బయటకు వచ్చింది. మరోవైపు పొంగులేటి తన వ్యూహంతో వ్యక్తుల్ని కలుపుకుని ముందుకెళ్తున్నారు. ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు సముఖత చూపుతున్నారు. ఇక తనతో పాటు దాదాపుగా 10 నుంచి 12 మంది అసెంబ్లీ స్థానాల్లో అనుచరుల్ని నిల్చోబెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఖమ్మం రాజకీయంపై ఫోకస్ అయింది. ఇక తాజాగా పొంగులేటి సీఎం కెసిఆర్ ని టార్గెట్ చేశారు.

గురువారం బీజేపీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి అతనితో భేటీ అయ్యారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో దాదాపుగా 6 గంటల పాటు చర్చలు జరిపారు. ఈటెల రాజేందర్ నాయకత్వంలో ఈ భేటీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ నేతలు ఏనుగు రవీందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి. యేలేటి మహేశ్వరరెడ్డి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అతిధులందరికి పొంగులేటి విందు ఎర్పాటు చేశారు.

దాదాపుగా ఆరు గంటలపాటు సాగిన ఈ భేటీలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. బీజేపీలో చేరితే పొంగులేటికి అన్నివిధాలుగా అండగా ఉంటామని బీజేపీ నేతలు ఆయనకు చెప్పారు. అధిష్టానం నుంచి హామీ ఇప్పిస్తామని, కెసిఆర్ ని నిలువరించాలి అంటే పొంగులేటి లాంటి బలమైన నాయకులు అవసరమని బీజేపీ క్యాడర్ తెలిపింది. పొంగులేటి బీజేపీ లో చేరితే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ బలం పుంజుకుంటుందని అభిప్రాయపడింది. అయితే తమకు కొంత సమయం కావాలని, ఇప్పుడే మాట ఇవ్వలేమని పొంగులేటి, జూపల్లి అన్నట్టు సమాచారం. విశేషమేంటంటే ఖమ్మం నుంచి కెసిఆర్ ఎంపీగా పోటీ చేస్తే ఆయనపై ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అంటూ సవాల్ విసిరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం పొంగులేటి కామెంట్స్ బీఆర్ఎస్ వర్గాలను ఆలోచింపజేశాయి. మొత్తానికి బీజేపీ ఖమ్మంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఖమ్మంలో ఏ మాత్రం పట్టు లేని బీజేపీకి పొంగులేటి బలం తోడైతే బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఉండబోతున్నట్టు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Read More: Samyuktha Menon : చీరలో దేవకన్యలా కనిపిస్తున్న విరూపాక్ష భామ