ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎంపీ స్థానాలను సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించడం బీజేపీ బలాన్ని రుజువు చేస్తోంది. ఈ విజయాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బీజేపీ పెరుగుతున్న ప్రాధాన్యత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాజాగా జరిగిన కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో బీజేపీ నేత బండి సంజయ్ ప్రసంగించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మోడీ ప్రభుత్వ నిష్కళంక పాలనను ప్రజలు గుర్తించారని, అందుకే వరుస విజయాలు సాధించగలుగుతున్నామన్నారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు గెలవడం ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
MLC Results: బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘనవిజయం
కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రజలు డబ్బుకు లొంగకుండా బీజేపీకి పట్టం కట్టారని, ఓటింగ్‌లో నిజాయితీ విజయాన్ని సాధించిందని తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల)పై అనేక ఆరోపణలు చేసినప్పటికీ, ఈసారి బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీజేపీని ఓడించేందుకు యత్నించాయని, కానీ ప్రజలు వారి కుట్రలను తిప్పికొట్టారని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని, రాబోయే రోజుల్లో బీజేపీ ఇంకా బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ విజయపథంలో దూసుకుపోతున్నట్లు తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.