BJP Focus: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టింది.

  • Written By:
  • Publish Date - August 28, 2022 / 10:58 AM IST

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆ పార్టీకీ తెలంగాణలో ఆశాజనకంగా ఉండటంతో ఈ సారి అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ను ఎదుర్కోవడం అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. బీజేపీ అన్ని అంశాలను ద‌ృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా రాజకీయ నాయకులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ సీటు ఇచ్చారని భావిస్తున్నారు. ఈ నెల 22న మునుగోడు సభ కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను పిలిచి మరీ కలిశారు. వారు నోవాటెల్ హోటల్ లో సమావేశమై కొద్దిసేపు చర్చించుకున్నారు.

అది రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన నచ్చి అమిత్ షా ఆయనను కలిశారని చెబుతున్నా, రాజకీయ ప్రయోజనం కోసమే కలిశారని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ తరపున ప్రచారం చేయమని అమిత్ షా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అంతటితో ఆగలేదు.

తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్ లో సినీ హీరో నితిన్‌, ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, ఏపీకి చెందిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను కలిశారు. వీరందరితో నడ్డా రాజకీయాలు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు కూడా దానికి మద్దతు పలుకుతున్నాయి. గీతను ఆమె భర్తతోపాటు ల‌క్ష్మ‌ణ్ స్వ‌యంగా న‌డ్డా వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. గీత‌ బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందు కోసమే ఆమె నడ్డాను కలిసినట్లు సమాచారం. నడ్డాను కలిసిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ నితిన్, మిథాలీతో నడ్డా రాజకీయాల గురించి చర్చించినట్లు చెప్పారు. నరేంద్ర మోదీ పాలనకు నితిన్, మిథాలీ ఆకర్షితులైనట్లు తెలిపారు. పార్టీకి సేవలందించేందుకు ఇద్దరూ సిద్ధం ఉన్నారన్నారు. త్వరలోనే వారు మోదీని కలిసే ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్‍తో కూడా అమిత్ షా రాజకీయాల గురించే చర్చించి ఉండవచ్చునన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కొత్తపల్లి గీతల వల్ల ఏపీలో కూడా బీజేపీకి ప్రయోజం ఉంటుందన్న ఆలోచనలో బీజేపీ ఉంది.