Site icon HashtagU Telugu

BJP in trouble : తెలంగాణ BJP ప్ర‌క్షాళ‌న‌! ఈటెల‌కు కీల‌క ప‌ద‌వి?

BJP in trouble

Bjp

ఒక వ‌ర‌లో రెండు క‌త్తులు ఇమ‌డవని సామెత‌. ఇప్పుడు దాన్ని బీజేపీ తెలంగాణ (BJP in trouble)విభాగానికి వ‌ర్తింపు చేయొచ్చు. ఒకే సామాజిక‌వ‌ర్గం నుంచి బ‌ల‌మైన లీడ‌ర్లుగా బండి సంజ‌య్,(sanjay) ఈటెల రాజేంద్ర (Rajendra) ఉన్నారు. వాళ్ల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డం పెద్ద స‌వాల్ గా బీజేపీ అధిష్టానంకు మారింది. ప్ర‌స్తుతం సంజ‌య్ బీజేపీ తెలంగాణ చీఫ్ గా ఉన్నారు. ఆయ‌న ఆ ప‌ద‌విని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌లేక‌పోతున్నారని పార్టీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. సీనియ‌ర్లు ఎవ‌రూ ఆయ‌న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌ను జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్లు ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌లేక‌పోతున్నారు. తిరిగి సొంత గూటికి చేరుకోవ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. స‌రిగ్గా, ఇక్క‌డే బీజేపీ అధిష్టానం సీరియ‌స్ గా తెలంగాణ బీజేపీ చీఫ్ వ్య‌వ‌హారాన్ని ప‌రిశీలిస్తోంది.

తెలంగాణ బీజేపీ చీఫ్ వ్య‌వ‌హారాన్ని ప‌రిశీలిస్తోంది (BJP in trouble)

రాజ‌కీయంగా బండి సంజ‌య్ కి ఉన్న ట్రాక్ రికార్డ్ త‌క్కువే. ఆయ‌న ఎంపీటీసీ నుంచి ఏకంగా 2019 ఎన్నిక‌ల్లో ఎంపీ అయ్యారు. ఆ త‌రువాత బీజేపీ చీఫ్ ప‌ద‌విని పొందారు. అప్ప‌టికే ఆర్ ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌గా మంచిపేరుంది. అంత‌కు మిన‌హా స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో పెద్ద‌గా అనుభ‌వం లేదు. బీజేపీ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ప్ర‌జా సంగ్రామ యాత్రను విడ‌త‌ల‌వారీగా చేశారు. సంఘ్ ప‌రిచ‌యాలు మిన‌హా రాజ‌కీయంగా ఆయ‌న‌కు పెద్ద‌గా ఫాలోయింగ్ లేదు. ఫ‌లితంగా యాత్ర ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా ఫెయిల్ అయింది. ఉప ఎన్నిక‌ల్లోనూ బండి సంజ‌య్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఫెయిల్ గా(BJP in trouble) చెప్పుకోవాలి. ఎందుకంటే, నాగార్జున సాగ‌ర్, హుజూర్ న‌గ‌ర్, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ గ‌ల్లంతు అయింది. మూడో ప్లేస్ కంటే ఘోరంగా డిపాజిట్లకు కూడా దూరంగా ఉండిపోయింది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలోనే

తెలంగాణాలో మారిన ప‌రిస్థితుల దృష్ట్యా దుబ్బాక ఎమ్మెల్యేగా ర‌ఘునంద‌న్ గెలిచారు. ఆయ‌న కేసీఆర్ సామాజిక‌వ‌ర్గం. పైగా అక్క‌డ పోటీని సామాజిక‌వ‌ర్గం కోణంలో ప్ర‌త్య‌ర్థులు తీసుకున్నారు. అక్క‌డ ప‌రోక్షంగా టీఆర్ఎస్ పార్టీ స‌హ‌కారం అందించింద‌న్న టాక్ అప్ప‌ట్లో వినిపించింది. కేవ‌లం వంద‌ల ఓట్ల తేడాతో మాత్ర‌మే బీజేపీ అభ్య‌ర్థి గెలుపొందారు. ఆ త‌రువాత గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కొంత మేర‌కు బీజేపీ స‌త్తా చాటింది. తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండ‌డంతో ఆ మేర‌కు గెలుపు బీజేపీకి సాధ్య‌ప‌డింది. ఇక హుజూరాబాద్ ఉప ఫ‌లితం పూర్తిగా ఈటెల రాజేంద్ర‌కు ఉన్న చ‌రిష్మాకు సంబంధించిన‌ది. ఇలా బండి సంజ‌య్ హ‌యాంలోని ఫ‌లితాల‌ను తీసుకుంటే ఆయ‌న గ్రాఫ్ ఆశించిన విధంగా (BJP in trouble) లేదు. కానీ, ఇటీవ‌ల సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల ముగింపు స‌భ హిట్ ప్ర‌త్యేక గుర్తింపు ను తెచ్చింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షా శ‌భాష్ అనేలా నిర్వ‌హించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలోనే నిర్వ‌హించాల‌ని అధిష్టానం నిర్ణ‌యించింది.

ఈటెల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా?(BJP in trouble)

ఎప్పుడైతే, అధిష్టానం వ‌చ్చే ఎన్నిక‌ల‌ను బండి ఆధ్వ‌ర్యంలోనే నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించిందో, అప్ప‌టి నుంచి బీజేపీలో ముసలం (BJP in trouble) మొద‌ల‌యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దాసోజు శ్రావ‌ణ్ వారం రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ త‌రువాత కొంద‌రు ఇత‌ర పార్టీల వైపు మ‌ళ్లారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో కొన‌సాగుతోన్న విజ‌య‌శాంతి, డీకే అరుణ, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, ఈటెల‌ త‌దిత‌రులు అయిష్టంగా ఉన్నార‌ని తెలుస్తోంది. క‌రీంన‌గ‌ర్ కేంద్రంగా ఒక గ్రూప్ బండికి వ్య‌తిరేకంగా ఢిల్లీ వ‌ర‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసింది. ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రూ బీజేపీ వైపు చూడ‌డంలేదు. కార‌ణం బండి సంజ‌య్ బ‌ల‌హీన‌మైన‌, ఏక‌ప‌క్ష ధోర‌ణి అంటూ ముక్త‌కంఠంతో బీజేపీ స్థానిక నేత‌ల అభిప్రాయం.

ఈటెల రాజేంద్ర రాజ‌కీయ ప్రొఫైల్

ఇక ఈటెల రాజేంద్ర రాజ‌కీయ ప్రొఫైల్ చాలా పెద్ద‌ది. పైగా ఉద్య‌మ‌నాయ‌కుడు. ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ కు ద‌డ‌పుట్టించే సామ‌ర్థ్యం ఉన్న నాయ‌కుడు. లెఫ్ట్ భావ‌జాలం ఉన్న‌ప్ప‌టికీ అంద‌ర్నీ క‌లుపుకుని పోయే నైజం ఉన్న లీడ‌ర్. ఆయ‌నకు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే టోట‌ల్ సీన్ తెలంగాణ వ్యాప్తంగా మారిపోతుంద‌ని చాలా మందిలోని భావ‌న‌. ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ తో కొట్లాడేందుకు ధీటైన లీడ‌ర్ గా పేరుంది. పైగా కేసీఆర్ బాధితునిగా ఉన్నారు. గ‌త రెండు ద‌శాబ్దాలుగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్ర‌జాప్ర‌తినిధిగా గుర్తింపు ఉంది. అంచ‌లంచెలుగా ఎదిగిన సీనియ‌ర్ పొలిటిసీయ‌న్. ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌నిచేయ‌డాన‌కి ఎక్కువ‌గా బీజేపీలోని సీనియ‌ర్లు ఇష్ట‌ప‌డుతున్నారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్లు కూడా ఆయ‌న‌కు అండ‌గా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్టీ కోసం ఈటెల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా? బండి సంజ‌య్ కోసం పార్టీని త్యాగం (BJP in trouble) చేయ‌డానికి అధిష్టానం సిద్ధ‌ప‌డుతుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : T BJP : అమిత్ షా ప‌ర్య‌ట‌న‌కు RRR ట‌చ్‌, BRS గ్లామ‌ర్ కు చెక్

ఒక వేళ నాయ‌క‌త్వాన్ని మార్చ‌కుండా మొండిగా అధిష్టానం ఉంటే, తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. పైగా ఈటెల‌తో స‌హా ప‌లువురు సీనియ‌ర్లు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ‌తార‌ని తెలుస్తోంది. పార్టీ ఖాళీ కానుంద‌న్న సంకేతాలు ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో బండి నాయ‌క‌త్వాన్ని కాద‌ని ఈటెల‌కు అప్ప‌గిస్తార‌ని చ‌ర్చ నడుస్తోంది.

Also Read : Telangana BJP : తెలంగాణ బీజేపీకి ఏమైంది..? కాంగ్రెస్ దూకుడుతో తేలిపోతున్న క‌మ‌లం.. కోవ‌ర్టులే కార‌ణ‌మా?