తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలు బీజేపీ(BJP)లో కీలక మార్పులకు దారితీస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మీద ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర నాయకత్వం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు నగరంలోని బలమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గం (Goshamahal Constituency)ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు ఈ స్థానం నుంచి వరుస విజయాలు సాధించిన రాజాసింగ్ (Rajasingh) పార్టీకి రాజీనామా చేయడంతో కొత్త నేత కోసం పార్టీ కసరత్తు ప్రారంభించింది. రాజాసింగ్‌ను బరిలోకి దించకూడదని నిర్ణయించుకున్న బీజేపీ, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాయాలని సిద్ధమవుతోంది.
రాజాసింగ్ స్థానంలో కొత్త ఫైర్ బ్రాండ్‌గా ప్రముఖ హిందూ సామాజిక కార్యకర్త, వైద్య రంగంలో పేరు సంపాదించిన మాధవీ లత(Madavilatha)ను రంగంలోకి దించాలని బీజేపీ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ఎంపీగా 2024 లో అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా బీజేపీ నుంచి మాధవీ లత బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆమెకు అప్పుడు భారీ ఓట్లతో మద్దతు లభించింది. దీంతో ఆమెపై పార్టీకి మరోసారి నమ్మకం ఏర్పడింది. గోషామహల్‌లో పార్టీ పట్టు నిలబెట్టేందుకు ఆమెకు ఇక్కడి నుంచే బాధ్యతలు అప్పగిస్తోంది. ఆమె ప్రజల మధ్య అందుబాటులో ఉండే నేతగా పేరు తెచ్చుకున్న విషయం కూడా ఈ నిర్ణయానికి ఊతమిచ్చిన అంశం.
మాధవీ లత ఓ శక్తివంతమైన నాయకురాలిగా పాపులర్ అవుతున్నారు. విరించి హాస్పిటల్స్ చైర్ పర్సన్‌గా వైద్య సేవలు అందించడం, హిందుత్వం అంశాలపై గళమెత్తడం, పాతబస్తీ ప్రాంతాల్లో హిందువుల సమస్యలపై స్పందించడం ఆమెకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చింది. అలాగే ఆమె ఒక క్లాసికల్ సంగీతకారిణిగా, “లతామా ఫౌండేషన్” ద్వారా మహిళా సాధికారతకు సేవలు అందిస్తున్నారు. మాధవీ లత బరిలో ఉంటే గోషామహల్ లో పోటీ రసవత్తరంగా మారే అవకాశముంది. మరోవైపు రాజాసింగ్ శివసేనలో చేరితే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ఏర్పడనుంది. చూద్దాం మరి ఏంజరగబోతుందో..!!