Site icon HashtagU Telugu

KTR: ప్రజా పోరాటాల చరిత్ర బీజేపీకి లేదు : కేటీఆర్

Ktr Kishen Reddy

Ktr Kishen Reddy

బీజేపీ పై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజా పోరాటాలు చేసిన చరిత్రే ఆ పార్టీకి లేదని మండిపడ్డారు. అబద్ధాలు, బూటకపు హామీలు అనే డబుల్ ఇంజన్లు బీజేపీకి ప్రధాన బలంగా మారాయని కేటీఆర్ ధ్వజమెత్తారు.

ఈమేరకు ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో అల్లూరి సీతారామరాజు ఫోటోను ప్రదర్శించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. తెలంగాణ ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఏముందని ప్రశ్నించారు.

“హైదరాబాద్ కు కానీ.. తెలంగాణ కు కానీ అల్లూరి సీతారామరాజు ఏం చేశారో ఎవరైనా చెప్పగలరా? ఈ వ్యవహారాన్ని చూస్తుంటే.. “ఆర్ ఆర్ ఆర్” మూవీ డైరెక్టర్ రాజమౌళి పేరును కూడా బీజేపీ వాళ్ళు అజ్ఞానంతో వాడేసేలా ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు కానీ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కానీ తెలంగాణా రాష్ట్ర చరిత్ర పై అవగాహన లేదు అనేందుకు ఇదొక నిదర్శనం .

ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ సభలో అమిత్ షా ప్రసంగంలోనూ అల్లూరి సీతారామరాజు పేరును ప్రస్తావించడం దారుణం” అని పేర్కొంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కృశాంక్ మన్నే ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. దాన్ని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు.