Site icon HashtagU Telugu

BJP Game Plan : రామోజీ, జూనియ‌ర్ల భేటీలోని బీజేపీ గేమ్‌

Amit Shah Ramoji Jr Ntr

Amit Shah Ramoji Jr Ntr

ఎన్డీయేతో చంద్ర‌బాబు పొత్తు పెట్టుకుంటార‌ని జాతీయ మీడియా సైతం ఊద‌ర‌కొడుతోంది. కానీ, ప్ర‌స్తుత బీజేపీ గురించి లోతుగా తెలిసిన వాళ్లు మాత్రం చంద్ర‌బాబును వ్యూహాత్మ‌కంగా దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని అనుమానిస్తున్నారు. మోడీ, షా ద్వ‌యం ఆధ్వ‌ర్యంలోని బీజేపీ చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటారని భ్రమించేవాళ్లు లేక‌పోలేదు. అందుకు ఉదాహ‌ర‌ణను కూడా కోడ్ చేస్తున్నారు. స‌హ‌జంగా చంద్రబాబు కు బాగా అండగా ఉండే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ మ‌ధ్య కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ నుంచి నిర్ధాక్ష‌ణ్యంగా గెంటేయ‌డాన్ని ఉదహ‌రిస్తున్నారు. చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన మార్గ‌ద‌ర్శి చిట్ ఫండ్ కంపెనీ కేసును మ‌ళ్లీ జగన్ మోహన్ రెడ్డి ద్వారా ఓపెన్ చేయించిన వాళ్లు ఎవ‌రో ప్ర‌శ్న వేసుకుంటే మోడీ, షా ద్వ‌యం వ్యూహం అర్థం అవుతుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని కొంద‌రు చెబుతున్నారు. విచిత్రంగా రామోజీరావును ఫిల్మ్ సిటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క‌లిసిన రోజే రామోజీ చిట్ ఫండ్ కేసును తిర‌గ‌తోడారు. కొంత భాగం మీడియాలో కొంద‌రు జర్నలిస్టులు కేవలం మైలేజ్ కోసం వాళ్లిద్ద‌రి భేటీని ప‌లు కోణాల నుంచి జ‌న బహుళ్యంలోకి తీసుకెళ్లారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడును మళ్ళీ ఎన్డీఏలోకి చేర్చుకోవడంలో మోడీ మాట అటుంచి అమిత్ షా సుతరమూ ఇష్టం లేదని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌. అభిన‌వ స‌ర్థార్ ప‌టేల్ అంటూ బీజేపీ ముద్దుగా పిలుచుకునే అమిత్ షా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల‌ను ఉక్కుపాదంతో చిదిమేస్తున్నారు. ప్ర‌స్తుతం మోడీ – షా ద్వయం ఆధ్వర్యంలో ఎన్డీఏతో చేయి కలిపిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఆ పార్టీల నాయకులు మట్టిక‌రిచిన సీన్ల‌ను చూస్తున్నాం.

ఇటు రామోజీరావుపై మార్గదర్శి చిట్ ఫండ్ కేసును తిరిగి ఓపెన్ చేయించి, మళ్లీ ఆయనతోనే ఆయన స్వగృహంలోనే మంతనాలకు అమిత్ షా తెర తీశారు. ఈనాడు పత్రికను బిజెపి వైపు మళ్లించేందుకే మార్గదర్శి చిట్ ఫండ్ కేసును జగన్ మోహన్ రెడ్డితో రీ ఓపెన్ చేయించార‌ని వినిపిస్తోంది. ఒక చేత్తో కేసులు బనాయిస్తూ, మరో చేత్తో మాయమాటలు చెప్పడం- మంత్రాంగాలు నడపడం కొంద‌రు గుజరాతీయులకు వెన్నతో పెట్టిన విద్యగా ఆ పార్టీలోని వాళ్లే చెప్పుకుంటారు. ప్రస్తుతం అమీషా చేస్తున్నదీ అదే. జూనియర్ ఎన్టీఆర్ ను దువ్వడం ద్వారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలు పంపించడం మాత్రమే మోడీ-షాల మంత్రాంగం ఉద్దేశమ‌ని బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం తీరు బాగా తెలిసిన వాళ్లు చెప్పుకునే మాట‌లు. రెండు తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో అయోమయం సృష్టించడమే రామోజీ, జూనియర్ ఎన్టీఆర్ లతో `షా` భేటీలోని మ‌ర్మ‌మ‌ట‌.
మోడీ- అమిత్ షా తెరమీద కనిపించే బిజెపి మార్గదర్శకులు అయితే తెర వెనుక మరో ముగ్గురు వ్యూహకర్తలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై గత మూడు మాసాలుగా దృష్టి సారించారు. వారి ముగ్గురి మాటలే అమిత్ షాకు అసలు సిసలు గీటురాళ్లు. వారి వ్యూహాలను కాదని అమిత్ షా ముందుకు వెళ్లే పరిస్థితి లేద‌ని తెలుస్తోంది.

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనతోనే కొన్ని అనూహ్య పరిణామాలు అతనికి అనుకూలంగా చోటు చేసుకున్న విషయాన్ని చాలామంది గుర్తించడం లేదు. న్యాయస్థానాలకు సంబంధించిన ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావించడం సముచితం కాదు. ప్రస్తుతం 17 పైగా కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ఆయా కేసుల్లో కేవలం జరిమానాలతో బయటపడేందుకు క‌మ‌ల‌నాథుల చుట్టూ తిరుగుతున్నార‌ని సర్వ‌త్రా తెలిసిందే. అతను కేసుల నుంచి పూర్తిగా బయటపడితే చేయి దాటి పోతాడని బిజెపి అగ్రనాయకత్వానికి బాగా తెలుసు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాదిన పడే గండిని పూడ్చుకోవాలంటే దక్షిణాదిలో సొంతంగా కొన్ని లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని బిజెపి అగ్రనాయకత్వం ప్రణాళిక రచిస్తోంది. దానిలో భాగంగా ఏపీలో 5 నుంచి 8 లోక్ సభ స్థానాలు, తెలంగాణలో 8 నుంచి 10 లోక్ సభ స్థానాలపై గురి పెట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో జట్టు కట్టినా బీజేపీ ల‌క్ష్యం నెరవేరే పరిస్థితి లేదని ఒక అభిప్రాయానికి వ‌చ్చార‌ట‌. జగన్ పార్టీతో పొత్తు సాధ్యం కాదని బిజెపి నేతలకు బాగా తెలుసు. తెలంగాణలో స్థిరపడిన లేదా వలస వచ్చిన ఆంధ్రులు బిజెపికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయరనే భయంతో బిజెపి సెటిలర్లను పలు విధాలుగా దువ్వే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే రామోజీ, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌దిత‌రుల‌తో స‌మావేశాలు అనేది స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న వాద‌న‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ఉపయుక్తంగా ఉంటుందంటే తప్ప చంద్ర‌బాబుతో పొత్తు లేదా అవ‌గాహ‌నకు బీజేపీ ముంద‌డ‌గు వేసే అవ‌కాశం లేదు. ప్రస్తుతం నలుగుతున్న రాజకీయమంతా ప్రత్యర్థులను అయోమయానికి గురి చేయడం మాత్రమే. అంతకుమించి మరేమీ లేదు. అవసరం తీరిన తరువాత అందరిని తొక్కేయడమే బిజెపి నైజం. బిజెపి దృష్టి అంతా ప్రస్తుతం తెలంగాణపై కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి అడుగులు వేయాలో బిజెపి నిర్ణయిస్తుంది. అప్పటిదాకా తెలుగుదేశం శ్రేణులు, సానుభూతిపరులు బిజెపి వ్యవహారాలను ఎక్కువ‌గా ఊహించుకోవడం అనవసరం.