BJP Strategy: తెలంగాణలో మిస్డ్ కాల్, బూత్ లెవల్ రాజకీయాలు.. బీజేపీ కొత్త స్ట్రాటజీ!

దేశమంతా కాషాయమయం చేసేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. కమలనాథులు పవర్ కావాలనుకుంటే ఎలాగైనా దక్కించుకుంటారు.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 01:00 PM IST

దేశమంతా కాషాయమయం చేసేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. కమలనాథులు పవర్ కావాలనుకుంటే ఎలాగైనా దక్కించుకుంటారు. దానికి తాజా ఉదాహరణ మహారాష్ట్ర. కొరకరాని కొయ్యలా మారిన మహారాష్ట్ర రాజకీయాన్ని చివరకు తనవైపు తిప్పుకుంది. అక్కడ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. ఇప్పుడు తెలంగాణపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఢిల్లీలో ప్రధాని మోదీ మొదలు.. ఇక్కడ గల్లీలోని కార్యకర్తవరకు అందరిదీ ఒకే మిషన్. మరి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎలాంటి వ్యూహాలతో ఇకపై వెళ్లనుంది?

తెలంగాణలో పవర్ కావాలంటే రెండు వర్గాలపై ఫోకస్ పెట్టాలని బీజేపీకి తెలుసు. ఒకటి యువతరం.. రెండు సామాన్య ప్రజానీకం. అందుకే యూత్ అంతా మోదీ మానియాతో ఉండేలా ప్లాన్ చేసింది. సామాన్య ప్రజలకు అండగా ఉంటామని హామీలు ఇస్తోంది. అలా ఈ రెండు వర్గాల ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని బీజేపీ చెబుతోంది. మరి ఆ పార్టీ పాలించే 18 రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందా? లేదా?

తెలంగాణను సొంతం చేసుకోవడం కోసం గత ఎనిమిదేళ్లుగా బీజేపీ పావులు కదుపుతోంది. అందుకే 119 నియోజకవర్గాలకు తన టీమ్ ను పంపించింది. వాళ్లంతా అక్కడే మూడు రోజులపాటు మకాం వేశారు. వివిధ సంఘాలతో చర్చించారు. సంఘ్ కార్యాలయాలను సంప్రదించారు. అలా ఫీడ్ బ్యాక్ తీసుకుని అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చారు. దీనిని వడకట్టి ఫైనల్ రిపోర్ట్ ను హైకమాండ్ తయారుచేస్తుంది. అంటే జాతీయ కార్యవర్గ సమావేశాలంటే కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అవ్వలేదు. తెలంగాణవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పట్టు పెంచుకోవడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటుచేసింది.

బీజేపీకి దక్షిణాదిలో కర్ణాటక తరువాత కాస్త పట్టున్నది తెలంగాణలోనే. అందుకే ఇక్కడ ఈ స్థాయిలో పోరాటం చేస్తోంది. తెలంగాణలో తన బలాన్ని పెంచుకోవడానికి తగిన రాజకీయ వాతావరణం ఉందని దానికి అర్థమైంది. తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు ఎంపీల్లో ఒకరిని.. అంటే బండిసంజయ్ ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చేసింది. కిషన్ రెడ్డికి కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పించింది. పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ ను రాజ్యసభ సభ్యుడిగా చేసింది. ఈటల రాజేందర్ ను జాతీయకార్యవర్గ సభ్యుడిగా చేసింది. పైగా బండి సంజయ్ ఇప్పటికే రెండు విడతలుగా పాదయాత్ర కూడా చేశారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ పై దూకుడుతో పోరాడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలో తమకు ప్రాధాన్యత లభిస్తుందని.. ప్రజల దృష్టిలో పార్టీ ఇమేజ్ పెరుగుతుందని విశ్వసిస్తోంది.

గ్రౌండ్ లెవల్లో పార్టీని యాక్టివేట్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే యువమోర్చా, మహిళా, కిసాన్‌, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మోర్చా కార్యకర్తలకు ప్రాధాన్యతను పెంచింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. అన్ని స్థాయిల వారికి న్యాయం చేసినట్లవుతుందని బీజేపీ భావన. ఇక వీరంతా నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ ప్రకారం సమావేశం అవుతున్నారో లేదో చెక్ చేస్తుంది. ఆ మీటింగ్ లకు అందరూ వస్తున్నారా లేదా అన్నది తెలుసుకుంటోంది. దీనికోసం తీసుకువచ్చిందే మిస్డ్ కాల్ స్ట్రాటజీ. అంటే.. సమావేశాలకు వచ్చినవారంతా కచ్చితంగా పార్టీ ఇచ్చిన నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. అప్పుడే వారు హాజరైనట్టు లెక్క.

బూత్ లెవల్లో రాజకీయాల్లో బీజేపీ ఎప్పుడో ఆరితేరిపోయింది. ఇప్పుడు కూడా బూత్ ల వారీగా కార్యకర్తలకు ఒక ఫారంను ఇచ్చి నింపమంటోంది. దాని ద్వారా ఆ బూత్ కు సంబంధించి సమాచారం తీసుకుంటుంది. దీనివల్ల ఆ బూత్ లో పార్టీ ఏమేరకు పటిష్టంగా ఉందో హైకమాండ్ కు తెలుస్తుంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం.. తెరపైకి తీసుకువచ్చిందే.. అప్నా బూత్ – సబ్ సే మజ్బూత్ నినాదం. అంటే మన బూత్ – అన్నింటికన్నా పటిష్టం అని అర్థం. ఇలాంటి నినాదాలు, ప్రణాళికలతో బీజేపీ తెలంగాణను ఏమేరకు గెలుచుకుంటుందో చూడాలి.