Site icon HashtagU Telugu

Telangana : బిజెపి బేజారు.. కాంగ్రెస్ హుషారు..

Bjp Is Cheap.. Congress Is Smart.. In Telangana Elections 2023

Bjp Is Cheap.. Congress Is Smart.. In Telangana Elections 2023

By: డా. ప్రసాదమూర్తి

Telangana Election 2023 : దేశవ్యాప్తంగా బిజెపి మాట ఎలా ఉన్నా, తెలంగాణలో మాత్రం అత్యంత బలహీనంగా ఉన్నట్టు, అది నానాటికీ మరింత అథఃపాతాళానికి కూలిపోతున్నట్టు కనిపిస్తోంది. కేంద్రంలో గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టాలని సమరోత్సాహంతో పావులు కదుపుతోంది. కానీ ఆ ఉత్సాహం, ఆ స్వప్నం, సాకారం కావాలంటే దేశంలో ఉత్తరాది రాష్ట్రాలలోనే కాదు దక్షిణాది రాష్ట్రాలలో కూడా బిజెపి గణనీయమైన బలాన్ని, ప్రజా మద్దతును సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ బిజెపి (Telangana BJP) వారికి అత్యంత కీలకమైనదిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల మాట ఎలా ఉన్నా పార్లమెంటు ఎన్నికల్లోను, జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగేసరికి బిజెపి బలం గొప్పగా పుంజుకున్నట్టు కనిపించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఉత్తేజంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఇక తమదే హవా అని బిజెపి వారు చాన్నాళ్ళు మహోత్సాహం ప్రదర్శించారు. తెలంగాణలో కూడా తాము అధికారంలోకి రాబోతున్నామని బాహాటంగానే ప్రకటనలు గుప్పించారు. ఆ దిశగా భారీ సభలు, ప్రజా సమీకరణలు, వ్యతిరేక పార్టీల నుంచి నాయకుల వలసలు మహా జోరుగా సాగాయి. ఇదంతా ఇప్పుడు గత చరిత్రగా మారిపోయింది. కర్ణాటక ఎన్నికల తర్వాత, ఆ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత బిజెపి క్రమంగా దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణలో నీరసించి పోతూ వస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆ నిస్సత్తువ, ఆ నిస్తేజం పూర్తి రూపంలో బయటపడుతోంది. వేరే పార్టీల నుంచి బిజెపిలోకి వచ్చిన దిగ్గజాల్లాంటి నాయకులు పార్టీకి తిలోదకాలిచ్చి, తాము వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు తిరోగమన బాట పట్టారు. ఇదంతా చూస్తుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా బిజెపి తీసుకున్న తెలంగాణ ఎన్నికలలో (Telangana Elections) ఆ పార్టీ ఓట్లు సీట్లు మాత్రమే కాదు, ప్రతిష్టను కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నట్టుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి.

మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిన్న వివేక్ వెంకటస్వామి ఇలా ఒక్కొక్కరు కమలనాధులతో కటీఫ్ చెప్పి కాంగ్రెస్ వైపు కదిలిపోతున్నారు. చిన్నాచితకా నాయకులే కాదు వెళుతున్నది చాలా పెద్ద నాయకులు. రాజగోపాల్ రెడ్డిని పార్టీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించారు. మాజీ ఎంపీ వివేక్ ని మేనిఫెస్టో చైర్మన్ గా నియమించారు. ఇలా కీలక పదవుల్లో ఉన్న నాయకులే పార్టీని వదిలి వెళ్లిపోవడం సాధారణ విషయం కాదు. ఒక బలమైన నాయకుడు, రాష్ట్రవ్యాప్తంగా పలుకుబడి ఉన్న నాయకుడు కండువా మార్చుకోవడం అంటే, ఆయన వెనుక ఉన్న అశేష జనబాహుళ్యం చేతుల్లో జండాలు మారిపోవడంగానే భావించాలి. ఈ నాయకులతో ఈ వలసలు ఆగుతాయా అంటే వాతావరణ సూచనలు అలా కనిపించడం లేదు. ఇప్పటికే డీకే అరుణ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారని కాంగ్రెస్ పార్టీ పునరేకీకరణకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చిందని వింటున్నాం.

తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఒకప్పటి కాంగ్రెస్ మిత్రులందరికీ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పునరేకీకరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇదంతా చూస్తుంటే మరెందరో కీలకమైన నాయకులు బిజెపిని విడిచి హస్తంతో దోస్తీకి సిద్ధమవుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తే బిజెపి అధికారం మాట దేవుడెరుగు, కనీసం అందరూ భావిస్తున్నట్టుగా బిజెపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఘనంగా చీల్చి తద్వారా అధికార బిఆర్ఎస్ కు లాభపడే స్థితిలోనైనా ఉంటుందా అన్న అనుమానమే ఇప్పుడు ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఇంకా ఎందరో నాయకులు రావాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులే బహిరంగంగా మాట్లాడుతున్నారు. బహుశా డీకే అరుణతోపాటు విజయశాంతి, జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి మొదలైన నాయకులు కూడా కాంగ్రెస్ జెండా నీడలో తమ రాజకీయ గుడారాలు వేసుకునే అవకాశాలున్నట్టుగా కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఒకప్పుడు బిజెపి తెలంగాణలో తిరుగులేని పాగా వేస్తుందని ఊహాగానాలు, విశ్లేషణలు చేసిన ఆ రాజకీయ పరిశీలకులే ఇప్పుడు ఆ పార్టీ అథోముఖంగా పయనిస్తుందని బహిరంగంగానే చెబుతున్నారు. బండి సంజయ్ లాంటి బలమైన నాయకుడిని ఏనాడైతే పార్టీ సారధ్యం నుంచి తొలగించారో, ఆనాడే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని కొందరు విశ్లేషకులు బాహాటంగానే చెప్తున్నారు. ఒకపక్క బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే బిజెపి వైపు మళ్ళిన ఒకప్పటి తమ బలమైన నాయకులు ఇప్పుడు తిరుగు ముఖం పట్టి తమ సొంత ఇంటి వైపు రావడం కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఎంతో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలమైన ప్రతిపక్షంగా ముందుకు సాగుతోంది. దక్షిణాదిన బలహీనపడిన ఆ పార్టీ కర్ణాటక విజయంతో కదనోత్సాహంతో ఇప్పుడు కదులుతోంది. తెలంగాణలో బిజెపి నుంచి వలస వస్తున్న నాయకుల రాజకీయ నేపథ్యం కాంగ్రెస్కు ఎంతో మేలు చేయగలదని పరిశీలకుల అంచనా. అందుకే దేశంలో రాజకీయ పరిణామాల మాట ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం బిజెపి పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంభట్టు అన్నట్టుగా మారింది. తెలంగాణలో బిజెపిది కంచుకోట కాదని, అది కేవలం పేకమేడ అని ఇప్పుడు అర్థం చేసుకోవచ్చా అంటే దానికి సమాధానం బిజెపి నాయకులే చెప్పాలి.

Also Read:  Chandrababu Bail : జగన్ లండన్లో ఉండి బాబును అరెస్ట్ చేయిస్తే..పవన్ ఇటలీ లో ఉండి బెయిల్ ఇప్పించాడు