BJP Vs MIM : మజ్లిస్‌తో బీజేపీ ‘లోకల్’ ఫైట్.. బీఆర్ఎస్‌కు పరీక్షా కాలం!

మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ అఫందీ(BJP Vs MIM) గతంలో నూర్‌ఖాన్ బజార్, డబీర్‌పురా ఏరియాల నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు.

Published By: HashtagU Telugu Desk
Bjp Vs Mim Hyderabad Local Body Mlc Election Mirza Riazul Hasan Goutham Rao

BJP Vs MIM : భాగ్యనగర రాజకీయం రసవత్తరంగా మారింది. హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లో ప్రధాన పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్యే నెలకొంది.  బీజేపీ త‌ర‌ఫున గౌత‌మ్ రావు, ఎంఐఎం త‌ర‌ఫున మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ అఫందీ బ‌రిలోకి దిగారు. మజ్లిస్‌కు కాంగ్రెస్ నుంచి పరోక్ష మద్దతు ఉండగా.. బీజేపీకి పరోక్షంగా మరో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి సహకారం లభిస్తోందట.  ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రధాన పాత్ర పోషించేది గ్రేట‌ర్‌ హైదరాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌ పరిధిలోని కార్పొరేటర్లే. ప్రస్తుతం కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లకు హైదరాబాద్‌లో పెద్ద‌గా కార్పొరేటర్లు లేరు.

Also Read :Raghavulu : సీపీఎం చీఫ్ రేసులో బీవీ రాఘవులు.. ఆ ఇద్దరే కీలకం

బీజేపీ, మజ్లిస్ సంఖ్యాబలం ఇదీ..  

మొత్తం 81 మంది కార్పొరేటర్లలో అత్యధికంగా 40 మంది మజ్లిస్ పార్టీ వారే. బీజేపీకి కేవలం 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఓటు వేస్తారు. ఈవిషయంలోనూ మజ్లిసే ముందంజలో ఉంది. ఆ పార్టీకి 1 ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. బీజేపీకి 1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ  మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 1 5 మంది కార్పొరేటర్లను ఆకట్టుకునే పనిలో బీజేపీ ఉందని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మె ల్సీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ బీఆర్ఎస్‌కు చెందిన వారంతా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌత‌మ్ రావుకే ఓటు వేస్తే.. టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ  స్వల్ప మెజారిటీతో మజ్లిస్ అభ్యర్థి  మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ గెలిచే ఛాన్స్ ఉంటుంది.

బీఆర్ఎస్ ఏం చేయబోతోంది ? 

ఇక కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు కార్పొరేటర్లు, 1 రాజ్యసభ ఎంపీ, నలుగురు ఎమ్మె ల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం వీరు మజ్లిస్‌కు దన్నుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కూడా మజ్లిస్‌కు సన్నిహితంగా మసులుకుంటోంది. మొత్తం మీద ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తీసుకోబోయే వైఖరిని బట్టి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో రూపుదిద్దుకునే రాజకీయ సమీకరణాలను మనం ఊహించుకోవచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన జరగనుంది.  నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 9. ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 25న ఫలితాలను ప్రకటించనున్నారు.

Also Read :Gold Rate: భారీగా త‌గ్గుతున్న గోల్డ్ రేటు.. కార‌ణాలు ఏమిటంటే..?

మజ్లిస్ అభ్యర్థి ఎవరు ?

మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ అఫందీ(BJP Vs MIM) గతంలో నూర్‌ఖాన్ బజార్, డబీర్‌పురా ఏరియాల నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2019లో ఆయన  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2023‌లో ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయ్యింది. దీంతో మీర్జా రియాజ్‌కు మజ్లిస్ నుంచి మరోసారి అవకాశం కల్పించారు.

  Last Updated: 06 Apr 2025, 08:35 AM IST