Sanjay Bandi Politics:తెలంగాణ‌పై `బండి`కి కేంద్రం తోడునీడ‌

బీజేపీ తెలంగాణ‌ను వ‌దిలేట్టు లేదు. ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా గేమ్ ఆడుతోంది. ఫైన‌ల్ గేమ్ కు ప‌గ‌డ్బందీగా ప్రాక్టీస్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 01:22 PM IST

బీజేపీ తెలంగాణ‌ను వ‌దిలేట్టు లేదు. ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా గేమ్ ఆడుతోంది. ఫైన‌ల్ గేమ్ కు ప‌గ‌డ్బందీగా ప్రాక్టీస్ చేస్తోంది. ఒక వైపు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ ఇంకో వైపు కేంద్ర మంత్రులు మ‌రో వైపు స‌భ‌లు, స‌మావేశాలు. ఇలా తెలంగాణ ప్రాంతాన్ని చుట్టేస్తున్నారు బీజేపీ నేతలు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మరియు సహకార శాఖ సహాయ మంత్రి బీ.ఎల్ వర్మ శుక్ర‌వారం పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై యుద్ధం ప్రకటించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ప్రజా సంగ్రామ పాదయాత్రలకు కేంద్రమంత్రులను తెలంగాణాకు రప్పిస్తూ తెలంగాణాలో పట్టు సాధించటం కోసం కష్టపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీలతోనూ దూకుడుగా ముందుకు వెళ్తుంది. అంతేకాదు కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.

బీజేపీ లోక్‌సభ ప్రవాస్‌ యోజన వ్యూహం రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు పర్యటిస్తూ, ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు రాత్రులు ఉంటూ, నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చెయ్యటం మాత్రమే కాకుండా కేంద్ర పథకాల అమలు తీరును కూడా పరిశీలిస్తూ తెలంగాణా ప్రభుత్వ పాలనపై దాడిని కొనసాగిస్తున్నారు. బీజేపీ ‘లోక్‌సభ ప్రవాస్‌ యోజన’ వ్యూహంలో భాగంగా రాష్ట్రాన్ని ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ నాలుగు క్లస్టర్లుగా విభజించి కేంద్రమంత్రుల పర్యటనలను కొనసాగిస్తున్నారు.

కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తం ఖోడాభాయ్ రూపాలా ఆదిలాబాద్ క్లస్టర్‌కు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూ పర్యటనలు సాగిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి హైదరాబాద్ క్లస్టర్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ క్లస్టర్ బృందానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే నాయకత్వం వహిస్తుండగా, ఈశాన్య ప్రాంత సహాయ మంత్రి బి.ఎల్. వర్మ వరంగల్ క్లస్టర్‌లో పార్టీ కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిపై కేంద్రమంత్రులు రాష్ట్రంలో ఉన్న సమయంలో చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని రాష్ట్రంలో ఏ విధంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలి అన్నదానిపై వారు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.