MP Chamala: తెలంగాణ కేబినెట్‌లో మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ కేబినెట్‌లో కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ నేత, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు చోటు కల్పిస్తుంటే దాన్ని ఓర్వలేక రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
అజారుద్దీన్ మంత్రి పదవికి అడ్డుకునే కుట్ర
కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్ర ఉద్యమకాలం నుంచే లౌకికవాదంతో ముందుకు సాగుతోందని ఎంపీ చామల అన్నారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ధ్వజమెత్తారు. “మైనార్టీలంటే ఎందుకంత కడుపుమంట? తెలంగాణ కేబినెట్‌లో మైనార్టీ మంత్రి ఉండొద్దా? రాజకీయ లబ్ది కోసం మతాల మధ్య చిచ్చు పెడతారా?” అంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో మైనార్టీ నాయకుడిగా ఎదిగిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయానికి అడ్డుకట్ట వేయడానికి బీజేపీ, బీఆర్‌ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని చామల విమర్శించారు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్లనున్నాడా? అసలు నిజం ఇదే!
బీజేపీ నేతలు ప్రత్యక్షంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడమే ఈ కుట్రకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం ఫిర్యాదుతోనే ఆగకుండా అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా ఉండేందుకు గవర్నర్‌పై కూడా ఒత్తిడి తెచ్చి మంత్రివర్గ విస్తరణ జరగకుండా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ మైనార్టీ సోదరులు ఈ కుట్రను గుర్తించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారీ ఒప్పందం
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్‌ఎస్‌తో చేసుకున్న అంతర్గత ఒప్పందమే కారణమని చామల ఆరోపించారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదన్న కుట్రతోనే ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయన్నారు. గతంలో ఈ రెండు పార్టీలు చేసిన కుట్రలను కేసీఆర్ కూతురైన కవిత గారే ఎన్నో వేదికలపై బయటపెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయని, సర్వేల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటర్లు ఉన్నారని తేలడంతోనే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.
బీజేపీ ద్వంద్వ వైఖరిపై విమర్శ
భారత క్రికెట్ కెప్టెన్‌గా ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలబెట్టిన అజారుద్దీన్‌కు రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తుంటే ఈ రెండు పార్టీలు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాయని చామల ప్రశ్నించారు. ఇటీవల ఎర్రగడ్డ వద్ద మైనార్టీలకు ఖబరిస్తాన్ (స్మశానవాటిక) కోసం స్థలం కేటాయిస్తే కూడా ఈ రెండు పార్టీలు జనాన్ని రెచ్చగొట్టాయని గుర్తు చేశారు. బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ గత ఏడాది జనవరిలో రాజస్థాన్‌లో జరిగిన ఉపఎన్నికల్లో శ్రీకరణ్‌పూర్ నియోజకవర్గంలో సురేందర్‌పాల్ సింగ్ అనే వ్యక్తికి 20 రోజుల ముందు అభ్యర్థిగా ఖరారు చేసి, ఆ వెంటనే మంత్రి పదవి కూడా ఇచ్చారని “వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా?” అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సాకుతో మైనార్టీలను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తుంటే బీఆర్‌ఎస్ దానికి వంత పాడడం చూస్తుంటే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టమవుతోందని చామల అన్నారు.
