Site icon HashtagU Telugu

Teenmaar Mallanna : బీజేపీ భారీ స్కెచ్..! క‌మ‌లం గూటికి విఠ‌ల్‌, మ‌ల్ల‌న్న‌

Vittal Teenmar Mallanna

Vittal Teenmar Mallanna

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బిగ్ ఆప‌రేష‌న్ ను ప్రారంభిచింది. ఆ క్ర‌మంలోనే తెలంగాణ ఉద్యమ రాజ‌కీయ‌ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, కో-చైర్మన్‌గా ప‌నిచేసిన విఠ‌ల్ ను లాగేసుకుంది. ఆయ‌న టీఎస్ పీఎస్సీ స‌భ్యుడిగా కూడా ప‌నిచేసిన విష‌యం విదిత‌మే. ఇక విఠ‌ల్ తో పాటు తీర్మార్ మ‌ల్ల‌న్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. వీళ్ల‌తో పాటు మ‌రింత మంది ఉద్య‌మ‌కారుల‌ను తొలి విడ‌త ఆప‌రేష‌న్ లో చేర్చుకోవ‌డానికి బీజేపీ భారీ స్కెచ్ వేసింది.
తెలంగాణ ఉద్య‌మ సార‌థిగా అప్ప‌ట్లో కేసీఆర్ ఫోక‌స్ అయ్యాడు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఉద్య‌మాన్ని న‌డిపిన లీడ‌ర్ గా ఈటెల రాజేంద్రకు పేరుంది. ఆనాడు టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష నాయ‌కునిగా ఈటెల అసెంబ్లీలో పోరాడిన తీరు ఇప్ప‌టికీ అందరికీ గుర్తే. అంతేకాదు, మూకుమ్మ‌డి రాజీనామాల నుంచి స‌క‌ల‌జ‌నుల స‌మ్మె వ‌ర‌కు ఆయ‌న పోషించిన పాత్ర కీల‌కం. ఆయ‌న వెంట అనేక మంది ఉద్య‌మ‌కారులు న‌డిచారు. వాళ్ల‌ను ఇప్పుడు బీజేపీ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నంలో ఈటెల ఉన్నాడు.

`టీఆర్ఎస్ ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ. స‌న్యాసుల మ‌ఠం…` కాద‌ని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పాడు. తెలంగాణ ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే ఆ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఉద్య‌కారుల‌ను కాద‌ని తెలుగుదేశం పార్టీలోని ప‌లువుర్ని కారు ఎక్కించాడు. కాంగ్రెస్ పార్టీలోని వాళ్ల‌ను కూడా ఆక‌ర్షించాడు. ఫ‌లితంగా ఇత‌ర పార్టీల లీడ‌ర్లు మిన‌హా టీఆర్ఎస్ పార్టీలో ఉద్య‌మ‌కారులు రాజ‌కీయంగా ఎద‌గ‌లేక‌పోయారు. కోదండ‌రాంరెడ్డి, చెరుకు సుధాక‌ర్ లాంటి వాళ్ల‌ను వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ ప‌క్క‌న పెట్టేశాడు. చాలా కాలంగా ఉద్యమ‌కారులు కేసీఆర్ వైఖ‌రి మీద వ్య‌తిరేకంగా ఉన్నారు.ఆ విష‌యం ఈటెల‌కు తెలుసు. అందుకే,ఇప్పుడు క‌మ‌లం గూటికి వాళ్ల‌ను చేర్చుతున్నాడు. మ‌లి విడ‌త ఆప‌రేష‌న్ లో టీఆర్ఎస్ లోని అసంతృప్తి వాదుల‌పై వ‌ల వేయ‌డానికి స్కెచ్ వేశాడ‌ని తెలుస్తోంది. తుది విడ‌త‌లో ఆర్ఎస్ఎస్ భావ‌జాలం ఉన్న కాంగ్రెస్ లోని కీల‌క లీడ‌ర్ల మీద వ‌ల విస‌ర‌డానికి బీజేపీ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసింద‌ట‌.
ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ నుంచి కీల‌క లీడ‌ర్ల‌ను ఆక‌ర్షించాల‌ని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల ఏపీకి వ‌చ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్ల‌డించాడు. ఆ క్ర‌మంలోనే అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌కు బీజేపీ ఏపీ లీడ‌ర్లు మ‌ద్ధ‌తు ప‌లికారు. తాజాగా మూడు రాజ‌ధానుల అంశంపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద బీజేపీ అధ్య‌క్షుడు వీర్రాజు యుద్ధాన్ని ప్ర‌క‌టించాడు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని ఏపీ బీజేపీ ప్ర‌త్యేక పోరాటానికి సిద్ధం అవుతుంద‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో టీడీపీ, వైసీపీ నుంచి వ‌చ్చే లీడ‌ర్ల కోసం అన్వేష‌ణ ప్రారంభించింది.

ఇప్ప‌టికే బీజేపీలో కొన‌సాగుతోన్న చంద్ర‌బాబు టీం మీద అమిత్ షా ఒత్తిడి చేస్తున్నార‌ట‌. టీడీపీ నుంచి క‌నీసం డ‌జ‌ను మంది కీల‌క లీడ‌ర్ల‌ను తీసుకురావాల‌ని ఆదేశించాడ‌ని తెలుస్తోంది. రెబ‌ల్ ఎంపీగా వైసీపీలో ఉన్న ర‌ఘురామ క్రిష్ణంరాజు త్వ‌ర‌లోనే బీజేపీ గూటికి చేర‌తార‌ని తెలుస్తోంది. ఆయ‌న బాట‌లో వైసీపీలోని క‌నీసం 30 మంది ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు క‌మ‌లం బాట ప‌డ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తం మీద అటు ఏపీ ఇటు తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల నేత‌ల‌పై బీజేపీ వ‌ల వేసింది. ఎంద‌రు ఆ వ‌ల‌కు దొరుకుతారో..చూద్దాం.