Site icon HashtagU Telugu

BJP Preparations: బీజేపీ ‘దక్షిణ’ దండయాత్ర!

Bjp

Bjp

బీజేపీ అధినాయకత్వం ‘సౌత్’ మిషన్ స్టార్ట్ చేయబోతుందా? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనుందా? బీజేపీ ముఖ్య నేతలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారా? అంటే అవుననే సమాధానమిస్తోంది తెలంగాణ బీజేపీ. వచ్చే ఏడాది తెలంగాణ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభిస్తూ.. జూన్ 30 నుండి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రులతో సహా బిజెపి జాతీయ కార్యవర్గ (NEC) సభ్యుడు రెండు రోజులు గడపనున్నారు. జూన్ 2న హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభంకానున్న నేపథ్యంలో నేతలు రెండు రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడపనున్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు కేంద్ర మంత్రులతో సహా NEC సభ్యుడైన ఒక సీనియర్ నాయకుడు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజులు లేదా 48 గంటలు గడుపుతారని బీజేపీ సీనియర్ కార్యకర్త ఒకరు తెలిపారు. “119 మంది NEC సభ్యులు ఒక్కొక్కరికి ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఆ నిర్దిష్ట అసెంబ్లీ నియోజకవర్గ  గ్రౌండ్ సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలతో మమేకం కానున్నారు” అని ఆయన చెప్పారు. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీకి 2023 చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రులతో పాటు సీనియర్ నేతలంతా జూన్ 30 ఉదయానికి తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాలకు చేరుకోవాలని సూచించినట్లు సమాచారం. తెలంగాణ బిజెపి ‘మిషన్ సౌత్’పై దృష్టి సారిస్తోంది.

రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవడానికి పార్టీ అనేక కార్యక్రమాలను రూపొందించింది. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ ఎన్‌ఈసీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా పాల్గొంటారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా, షా సహా సీనియర్ నేతలు సన్నద్ధతలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండు రోజుల NEC సమావేశం ముగిసిన తర్వాత, మోడీ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోడీ బహిరంగ సభతో తెలంగాణలో దూకుడు పెంచాలని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ చేరికలతో దూసుకుపోతుండటంతో బీజేపీ సైతం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.