ఇందిరాపార్కు వద్ద సోమవారం జరగనున్న నిరుద్యోగ దీక్షకు అడ్డంకులు కల్పించేందుకే ప్రభుత్వం హడావుడిగా ర్యాలీలు, సమావేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో దీక్ష వేదిక స్థలాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంకి మార్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ జి మనోహర్ రెడ్డి ‘నిరుద్యోగ దీక్ష’కు అనుమతి నిరాకరణ నిర్ణయాన్ని సమీక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని.. దీక్ష చేస్తున్న సమయంలో సామాజిక దూరం పాటిస్తామని నేతలు తెలిపారు. ఒమిక్రాన్ కేసుల తీవ్రత దృష్ట్యా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించి మూడు రోజులైనా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అయితే ర్యాలీలు, సమావేశాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఇతర టీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ లోపలా, బయటా ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాత్రమే దీక్ష చేపట్టాలని పార్టీ యోచిస్తున్నట్లు నేతలు తెలిపారు. జిఓ జారీ చేయడం వల్ల అధికార పార్టీకి తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు కానీ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆగ్రహం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో జరిగే దీక్షలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని నేతలు తెలిపారు.