Site icon HashtagU Telugu

TS BJP: ఇన్ ఛార్జ్ లుగా ఇతర రాష్ట్రాల వారు.. తెలంగాణలో బీజేపీ సక్సెస్ ఫార్ములా రిపీట్

Telangana Bjp

తెలంగాణలో బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. విజయానికి అవసరమైన ఏ చర్యనైనా తీసుకోవడానికి అస్సలు వెనకడుగు వేయడం లేదు. అందుకే రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఇన్ ఛార్జ్ లుగా ఇతర రాష్ట్రాల నేతలకు బాధ్యతలు అప్పగించడం వెనుక మాస్టర్ ప్లానుంది. మరో ఏడాదో లేదంటే ఏడాదిన్నరకో తెలంగాణలో ఎన్నికలు జరిగే ఛాన్సుంది. అందుకే అప్పటివరకు ఎన్నికలు లేని రాష్ట్రాల్లోని నేతలను దీనికోసం ఎంపిక చేసింది. వాళ్లు తమ సొంత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అనాసక్తిగా ఉంటేనే వారికి ఈ బాధ్యతలను ఇచ్చేలా ప్లాన్ తయారుచేసింది.

119 నియోజకవర్గాల్లోని నేతల పేర్లను ఇప్పటికే అధిష్టానం సిద్ధం చేసింది. పార్టీ గెలిచే ఛాన్స్ ఉన్నచోట.. మంత్రులు, ఎంపీలతోపాటు ముఖ్య నేతలను ఇన్ ఛార్జులుగా పెడతారు. ఇక వారితోపాటు కేంద్ర సహాయమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీ జాతీయకార్యవర్గ సభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు.. ముఖ్య నేతలు.. ఇలా అందరినీ రంగంలోకి దింపేలా పక్కా స్కెచ్ ని వేసింది బీజేపి.

బీజేపీ ఎంపిక చేసిన ఇన్ ఛార్జులంతా ఈ నెల 28కే హైదరాబాద్ కు వస్తారు. నాలుగురోజుల పాటు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రిపోర్ట్ ను తయారుచేయాల్సి ఉంటుంది. ఇదంతా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే సిద్ధమవ్వాలి. ఆ తరువాత నెలకోసారి వాళ్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి తాజా నివేదికలను పార్టీకి ఇవ్వాలి. ఎన్నికలు అయ్యేవరకు వారికి ఇదే ముఖ్యమైన పని.

బీజేపీ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఎన్నికల సమయంలో వేరే రాష్ట్రాల నుంచి నేతలను తీసుకువచ్చి.. వారికి ఇక్కడి గెలుపు బాధ్యతలను అప్పగించింది. ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో ఇప్పుడూ దానిని అమలు చేస్తోంది.

Exit mobile version